ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు..

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.

Update: 2024-03-08 13:10 GMT

దిశ, చంద్రగిరి: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. అంతకుముందు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంత‌రం ఉద‌యం 9.45 గంట‌ల‌కు చ‌క్ర‌స్నానం ఘ‌నంగా జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్య పాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం తో స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశ శాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్తలు మంత్రాలు, దివ్యప్రబంధం లోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేదపారాయణ దారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాప విముక్తులై, ధనధాన్య సమృద్ధి తో తులతూగుతారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్లు చెంగ‌ల్రాయులు, వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చకులు బాలాజి రంగ‌చార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


Similar News