తెలంగాణలో వెనుకబడిన BRS.. వైసీపీలో టెన్షన్.. టెన్షన్..!
రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్స్ పోల్స్ వెలువడ్డాయి. జాతీయ సర్వే సంస్థలన్నీ
రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్స్ పోల్స్ వెలువడ్డాయి. జాతీయ సర్వే సంస్థలన్నీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంగట్టే అవకాశాలున్నట్లు తేల్చాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగించిన కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారానికి వస్తామని ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తోంది. నియంతృత్వ పోకడలు, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, భూసమస్యలు ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇక్కడ అధికార వైసీపీలో గుబులు రేకెత్తిస్తున్నాయి.
దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలవాలని వైసీపీ శ్రేణులు ఆశించాయి. కర్ణాటక గెలుపు ఊపు మీద ఉన్న కాంగ్రెస్‌పార్టీ అనూహ్యంగా తన బలాన్ని పెంచుకుంది. ఆర్నెల్ల క్రితం వరకూ బీఆర్‌ఎస్, బీజేపీ నువ్వా నేనా? అన్నట్లు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాయి. కాంగ్రెస్ బలంగా ముందుకు రావడంతో బీజేపీ కనుచూపు మేరలో కనిపించకుండా పోయింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ వైసీపీ మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. ఈ పాటికే పార్టీలో కొందరు సీనియర్లు తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టి తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు..?
అక్కడ కేసీఆర్ వెనుకబడినట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ కేసీఆర్ పాలన సాగింది. దాదాపు కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. అయినా ఆయన ఒంటెత్తు పోకడలు, అధిక ధరలు, నిరుద్యోగ సమస్య, సగటు గ్రామీణ ప్రజల ఆదాయాలు పడిపోవడం, భూ సమస్యలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి దోహదపడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్తెలియజేస్తున్నాయి.
ఉలిక్కి పడుతున్న వైసీపీ శ్రేణులు
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగడంతో ఇక్కడ వైసీపీ శ్రేణులు ఉలిక్కి పడుతున్నాయి. నాలుగున్నరేళ్ల నుంచి కేవలం సంక్షేమం పైనే వైసీపీ సర్కారు దృష్టి సారించింది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదు. నవరత్నాలతో ఆశించిన స్థాయిలో పేదల జీవన ప్రమాణాలు పెరగలేదు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలతోపాటు కరెంటు చార్జీలు, ఇతర పన్నులు సగటు ప్రజల జీవితాలను మరింతగా కుంగదీశాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత అక్కడ కాంగ్రెస్ మాదిరిగా ఇక్కడ టీడీపీకి అనుకూలంగా మారొచ్చు. అందుకే వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొన్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. మూడో తేదీన ఫలితాలు వెలువడ్డాక వైసీపీ వ్యూహం ఏంటనేది తెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
-