ఇప్పటంలో మళ్లీ టెన్షన్.. టెన్షన్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2023-03-04 07:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటం గ్రామంలో అధికారులు మళ్లీ ఆక్రమణల పేరిట కూల్చివేతలను శనివారం ఉదయం నుంచి ప్రారంభించారు. అనుమతించిన ఇంటి ప్లాన్లను అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారని ఆరోపిస్తూ అధికారులు ఆక్రమణలను కూల్చివేశారు. నగర పాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో 12 ఇళ్ల ప్రహరీ గోడల కూల్చివేశారు. మరోవైపు గ్రామంలో కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గ్రామ సరిహద్దుల్లో పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చేవారిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ఇరుగు పొరుగు వారిని గ్రామంలోకి అడుగుపెట్టనీయడం లేదు. గతంలో ఒకసారి ఇప్పటం గ్రామంలో ఆక్రమణల కూల్చివేత జరిగింది.

అయితే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు తాము స్థలాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ గ్రామస్థులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇప్పటం వెళ్లారు. ఇప్పటం వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నడుచుకుంటూ బయలుదేరారు. కొంతదూరం నడిచి వెళ్లాక అనుమతి ఇవ్వడంతో కారు టాప్‌పై కూర్చుని పవన్ వెళ్లిన తీరు కాస్త విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఇప్పటం వెళ్లి గ్రామస్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం సైతం అందించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News