TDP: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బస్సు యాత్ర.. ఈ నెల 19 నుంచే ప్రజల్లోకి..

తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ..

Update: 2023-06-14 12:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం మహానాడు వేదికగా ప్రకటించిన భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బస్సు ప్రచారం చేపట్టనుంది. ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జోన్లవారీగా 5 బస్సులు 125 నియోజకవర్గాల్లో తిరగనున్నాయని చెప్పారు. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు బస్సుల్లో వెళ్లి ప్రజలతో మమేకమవుతారన్నారు. మహిళలు, రైతులు, యువత, బీసీలు, పేదల్ని ఆదుకోవడమే లక్ష్యంగా, వారి సంతోషం, సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళ్లనుంది. వారికోసం చంద్రబాబు, టీడీపీ అమలు చేయబోయే కార్యక్రమాల్ని ప్రతిఒక్కరికీ తెలియచేయడంకోసం బస్సు ప్రచారం ప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

ఇక ప్రజల్లోకి

తెలుగుదేశం పార్టీ జోన్ స్థాయిలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ చేపట్టనుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందుకోసం 5 బస్సుల్ని అధునాతన హంగులతో తీర్చిదిద్ది 125 నియోజకవర్గాల్లో 30 రోజులపాటు తిప్పనున్నట్లు తెలిపారు. ఒక్కోజోన్‌కు ఒక్కో బస్సు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన నియోజవర్గాల్లో ఆ బస్సు తిరుగుతుందని చెప్పారు, ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి క్యాడర్ బస్సులో ఉండి ప్రజలతో మాట్లాడతారని తెలిపారు. అలాగే ప్రజల కష్ట సుఖాలు, బాధలు తెలుసుకొనిః చంద్రబాబు వారి కోసం తీసుకొచ్చిన ‘భవిషత్‌కు గ్యారెంటీ’ పథకాలను వివరిస్తారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అలానే జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న దోపిడీని, దారుణాలను తెలియచేస్తారని తెలిపారు. వీటితోపాటు ప్రజలతో కలిసి పల్లె నిద్రచేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో వారిభాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తారన్నారు.

ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగేలా పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తారన్నారు. ఈనెల 19న చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జెండా ఊపి 5 బస్సుల్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడతారన్నారు. రాష్ట్రంలోని తెలుగు దేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు జోనల్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతినియోజకవర్గంలో బస్సులపై తిరిగి, ప్రజల కష్టాలతోపాటు, వారి అభిప్రాయాలు తెలుసుకొని, భవిష్యత్‌లో రాష్ట్రం కోసం మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Read more: పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో అపశ్రుతి.. జనసైనికుడి మృతి 

Tags:    

Similar News