Teacher MLC : రేపు ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ఏపీ(AP)లో రేపు (గురువారం) ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ(Teacher MLC) ఉప ఎన్నిక జరగనుంది.

Update: 2024-12-04 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో రేపు (గురువారం) ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ(Teacher MLC) ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాకినాడ జిల్లాలో 3418 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 2990, డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 3296, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637, పశ్చిమగోదావరి జిల్లాలో 3729, ఏలూరు జిల్లాలో 2667 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను సురక్షితంగా కాకినాడ జేఎన్‌టీయూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ కు తరలించనున్నారు. ఈనెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నెల 12వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగుస్తుంది.

గత ఎన్నికల్లో యూటీ ఎఫ్‌ తరపున గెలిచిన షేక్‌ సాబ్జి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. యూటీ ఎఫ్‌ నేత బొర్రా గోపీమూర్తి, గంధం నారాయణ రావు, డాక్టర్ కవలనాగేశ్వరరావు, పులుగు దీపక్‌, నామన వెంకట లక్ష్మి(విళ్ల లక్ష్మి) పోటీ పడుతున్నారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం సెలవు దినంగా ప్రకటించారు.

Tags:    

Similar News