సొంత భూమిని 165 మంది పేదలకు పంచిన టీడీపీ ఎమ్మెల్యే
టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంచి మనసు చాటుకున్నారు. ...
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మంచి మనసు చాటుకున్నారు. 6.65 ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచి పెట్టారు. ఉరవకొండ మండలం మైలారంపల్లిలో రూ.1.33 కోట్ల విలువైన భూమిని 165 మంది పేదలకు 2.5 సెంట్ల చొప్పున ఒక్కొక్కరికి పంపిణీ చేశారు. స్వయంగా వారిపై రిజిస్ట్రేషన్ చేయించి ఆ పత్రాలను పేదలకు అందజేశారు. దీంతో పయ్యావుల కేశవ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. పేదలకు అండగా నిలబడిన ఏకైక నాయకుడు పయ్యావుల అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.
కాగా పీఏబీఆర్ జలాశయానికి సమీపంలో మైలారంపల్లి ఉంది. ఈ గ్రామం గత ఏడాది జలాశయం ముంపునకు గురైంది. ఈ విషయాన్ని గ్రామస్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ పట్టించుకోలేదు. అయితే మైలారంపల్లి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వయంగా చూశారు. తట్టుకోలేకపోయారు. భవిష్యత్తులో మైలారంపల్లి గ్రామస్తులు ఇబ్బందులు పడకూడదని తన భూమిని సాయం చేశారు. భవిష్యత్తులో ఆ భూముల్లో పూర్తి స్థాయి మౌళిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మైలారంపల్లి గ్రామస్తులకు మెరుగైన జీవనం అందించాలన్నది తన లక్ష్యమని పయ్యవుల కేశవ్ తెలిపారు.