ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సభ్యులు పోడియంను

Update: 2022-03-21 05:33 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో సభలో గందరగోళం చోటుచేసుకుంది. నాటు సారా, కల్తీ మధ్యం నిషేధించాలని టీడీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ఫ్లకార్డులు చేతపట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు వారి నిరసనను తెలియజేశారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులను ఒక్కరోజుపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సోమవారం సభలో పలు సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని మంత్రులు నిర్ణయించారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ధారించారు. మరోవైపు హిందూ ఛారిటబుల్‌ సవరణ బిల్,ఫారిన్‌ లిక్కర్‌ సవరణ బిల్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, టూరిజం, మెడికల్‌ అండ్‌ హెల్త్‌.. విద్యాశాఖ సంబంధించిన బడ్జెట్‌ డిమాండ్‌ గ్రాంట్స్‌పై ఓటింగ్‌ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సభకు వచ్చీరాగానే టీడీపీ సభ్యులు జంగారెడ్డి మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిరసన తెలిపారు.అయితే మార్షల్స్ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. అయినప్పటికీ టీడీపీ సభ్యులు బల్లలు చరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదే పదే అభ్యర్థించినా పట్టించుకోలేదు. నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్‌ సోమవారం ఒక రోజు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇది బజారు కాదు

సభలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఇది శాసససభ.. వీధి మార్కెట్ కాదు... మీరు వీధి రౌడీలు కాదు' ఇటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదని హితవు పలికారు. సభకు, స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలని సూచించారు. మీరు సరిగ్గా ప్రవర్తిస్తే మీతోనే సభను నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు సభ్యులు సభకు వచ్చే ముందు నిబంధనలు చదువుకుని రావాలని సూచించారు. అనేక ప్రశ్నలు ఉన్నాయని వాటిపై మాట్లాడాలంటూ ప్రతిపక్ష పార్టీ సభ్యులకు సూచించారు. అంతేకానీ ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. మరోవైపు సభలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో సభ్యుల ప్రవర్తన, నిబంధనావళిని సమీక్షించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు సూచించారు.

Tags:    

Similar News