ఉన్మాదిలా జగన్ తీరు ఉంది: Nara lokesh

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌పై బయటకు రావడంతో జగన్ సీఎం అని మరచి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ..

Update: 2023-11-02 16:19 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌పై బయటకు రావడంతో జగన్ సీఎం అని మరచి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌ర‌ స్థాయికి చేరింద‌ని ఎద్దేవా చేశారు. గ‌వ‌ర్నర్ త‌క్షణ‌మే జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాల‌ని కోరారు. చంద్రబాబుపై రోజుకో త‌ప్పుడు కేసు పెట్టడమే పనిగా పెట్టకున్నారని మండిపడ్డారు. క‌క్షతో ర‌గిలిపోతున్న జ‌గ‌న్ నైజం ఏంటో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని ఎద్దేవా చేశారు. సీఎం స్థానంలో ఉండి ఉన్మాదిలా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యకత్ం చేశారు. సీఐడీని వైసీపీ అనుంబంధ విభాగంగా మార్చుకుని ప్రతిపక్ష నేత మీద కేసుల మీద కేసులు పెట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేద‌న్నారు. ప్రతిప‌క్షాన్ని వేధించేందుకు వ్యవ‌స్థల్ని మేనేజ్ చేస్తూ ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ‌డం ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌లేద‌న్నారు. చంద్రబాబుపై ఆధారాల్లేని త‌ప్పుడు కేసులు వ‌రుస‌గా బ‌నాయించ‌డం చూసిన జ‌నం సీఎం జగన్‌కు పిచ్చి బాగా ముదిరిపోయింద‌ని చర్చించుకుంటున్నారని లోకేశ్ విమర్శించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతుంద‌ని నారా లోకేశ్ ఆవేద‌న వ్యక్తం చేశారు. ప్రజ‌లు ఇచ్చిన అధికారాన్ని త‌న‌ పిచ్చితో రాజ‌కీయ క‌క్ష సాధింపుల కోసం వాడుకుంటోన్న జ‌గ‌న్ దారుణ పరిస్థితిపై కేంద్రానికి వెంటనే నివేదికలు పంపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఫైబ‌ర్ నెట్ ప్రాజెక్టుపై మ‌రో కేసు, జె బ్రాండ్స్ అమ్ముతూ చంద్రబాబుపై లిక్కర్ స్కాం కేసు పెట్టిన జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కక్షలు, రాజకీయ వేధింపులు, అస్థిరత్వం, విధ్వంసం వైపు తీసుకెళ్లిన‌ పిచ్చి జ‌గ‌న్‌ను పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. ఎన్నికలు ద‌గ్గర ప‌డుతున్న వేళ‌ తాను రాష్ట్రానికి ఏం చేశానో చెప్పుకోలేక..ఇలా దొంగ కేసులతో ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలోనే అతి ఎక్కువ కేసులు, లెక్కలేన‌న్ని ఆస్తుల‌తో కరప్ట్ పొలిటీషియన్‌గా ముద్రపడిన జగన్ ఆ బురదను చంద్రబాబుకు అంటించాలని చూడడం దారుణమన్నారు. చంద్రబాబుపై జ‌గ‌న్ గ్యాంగ్ చేస్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌లు ఇకనైనా మానుకోవాలని నారా లోకేశ్ హితవు పలికారు.

Tags:    

Similar News