ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలిస్తాం.. కుప్పం టూర్‌లో చంద్రబాబు కీలక హామీ
తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు..
దిశ, కుప్పం: తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీకి కుప్పం కంచుకోట అని, నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో తాను సీఎం అయ్యాక వైసీపీ నేతలను వదిలిపెట్టాలా?, శిక్షించాలా? అని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలుపే లక్ష్యంగా ఇరుపార్టీల నేతలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పంలో అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పంకు ఏం చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నాలుగున్నారేళ్ల వైసీపీ పాలనలో భారీగా అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల ముసుగులో కోట్లు దండుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేం ఉంటే హంద్రీనీవా కింద ప్రతి ఎకరానికీ నీరు ఇచ్చేవాళ్లం. హంద్రీనీవా పూర్తి చేసేందుకు రాత్రి, పగలు కష్టపడ్డాం. మేం 87 శాతం పనులు పూర్తి చేస్తే, మిగతా 13 శాతం చేయలేకపోయారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. దోచిన డబ్బంతా వసూలు చేస్తాం. వైఎస్ జగన్ పాలనలో వీరు చేసిందల్లా రౌడీయిజం, భూకబ్జాలు, గ్రానైట్ దొంగ వ్యాపారం అని సీఎం జగన్‌పై చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.