జగన్.. కోటిరూపాయలు ఎక్కడ ? : బుధ్ధావెంకన్న
జగన్ వరద బాధితులకు సహాయంగా ప్రకటించిన కోటి రూపాయల్ని ఎవరికిచ్చారో చెప్పాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. తమపై అసత్య ప్రచారాలు చేస్తే.. వైసీపీ భూ స్థాపితం అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారాయన.
దిశ, వెబ్ డెస్క్: విజయవాడను బుడమేరు ముంచెత్తడానికి కారణం.. కూటమి ప్రభుత్వమని, ఇది కచ్చితంగా మానవతప్పిదంతో వచ్చిన వరదలేనని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నోసార్లు విమర్శించిన విషయం తెలిసిందే. వరద బాధితులకు అందరూ సహాయం చేస్తుంటే.. జగన్ మాత్రం విమర్శలు చేస్తున్నారని వార్తలు రావడంతో.. ఆయన కూడా వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించారు. వరద బాధితులకు సహాయం ప్రకటించడమే గానీ.. ఇంతవరకూ ఆ విరాళాన్ని ఎవరికిచ్చిందీ తెలియలేదు. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. జగన్ ప్రకటించిన కోటి రూపాయల విరాళం ఎవరికిచ్చారని ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వరదల్ని అడ్డంగా పెట్టుకుని టీడీపీ ప్రజల్ని దోచుకుందని ప్రచారం చేస్తున్న వైసీపీపై ఫైరయ్యారు. విజయవాడలో వరద బాధితుల్ని సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.
వరదలతో రోడ్డుపడిన కుటుంబాలకు ఆహారం, మంచినీరు, పాలు.. అందించి ఆదుకున్నారన్నారు. ప్రజలంతా చంద్రబాబు నాయుడు తమను ఆదుకున్నారని, ఆయన వల్లే ఇలా ఉన్నామని చెబుతుంటే.. దానిని చూసి వైసీపీ ఓర్వలేక ఇలాంటి నీఛ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతూ రాజకీయాలు చేస్తే.. త్వరలోనే వాళ్ల పార్టీ భూ స్థాపితం అవుతుందన్నారు. ప్రజలంతా వరదల్లో కొట్టుమిట్టాడుతుంటే.. జగన్ బయటికి రాకుండా ఏసీ గదిలో కూర్చుని చోద్యం చూశారని విమర్శించారు. కోటి రూపాయల విరాళం ఎవరికిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని తన స్వార్థానికి వాడుకున్న జగన్.. ఇప్పుడు నీతులు వల్లించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తే.. 11 నుంచి ఒక్క స్థానం కూడా లేకుండా పోతారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు.