తుఫాన్ హెచ్చరికలు.. రైతుల గుండెల్లో కలవరం
పైరు అంతా బాగా పండింది. చివరి దశలో వరి కోత ఉన్నటువంటి తరుణంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపిన కారణంగా అన్నదాతల్లో కలవర పెడుతోంది.
దిశ, కారంపూడి: పైరు అంతా బాగా పండింది. చివరి దశలో వరి కోత ఉన్నటువంటి తరుణంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపిన కారణంగా అన్నదాతల్లో కలవర పెడుతోంది. అల్పపీడనం ప్రభావంతో పంట చేతికి వచ్చే దశలో ఉన్న రైతుల గుండెల్లో గుబులు పుడుతుంది. ఈ తరుణంలో భారీ వర్షం కురిస్తే పరిస్థితి అగమ్య గోచరమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని సాగు చేసిన వరి పంట చేతికి అందుతున్న వేళ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరి రైతుల్లో కలవరం సృష్టిస్తున్నాయి.
పంట చేతికందే సమయంలో వచ్చిన అల్పపీడనం వల్ల వరి చేతికి అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కారంపూడి మండల పరిధిలో సుమారుగా 1,2090 ఎకరాల్లో వరి సాగవుతోంది. యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని రైతులు ఆర బెట్టలన్నా ఇబ్బంది కరంగా ఉంటుంది ధాన్యం ఒబ్బిడి చేసేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు. కోసిన పంటలు ఓ పక్క కల్లాల్లోనే ఉండటంతో వాటిని ఆరబెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలకు ధాన్యం తడిసి రంగు మారుతుందనే భయంతో టార్పాలిన్లు కప్పుతున్నారు. ఒకవేళ ధాన్యం తడిస్తే మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అనే సందేహాలు అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు