Ap News: అక్రమ కేసులే ‘జగన్’ అజెండా...!
ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడమే అజెండాగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వర రావు అన్నారు..
- ప్రివిలేజ్ ఫీజు రద్దుతో రూ.1300 కోట్లు నష్టం అనేది అబద్ధం
- విధాన నిర్ణయాల్లో తప్పు జరిగితే అధికారులను వదిలేసి సీఎంపై కేసులా ?
- టీడీపీ హయాంలో మద్యంలో ఎక్కడా అక్రమాల్లేవు
- - టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు
దిశ, ఏపీ బ్యూరో: ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడమే అజెండాగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వర రావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. టీడీపీ హయాంలో జరిగిన విధాన పరమైన మద్యం పాలసీపై చంద్రబాబు, కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. కోర్టులు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా సిగ్గు లేకుండా అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారని విమర్శించారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.1300 కోట్లు నష్టం వచ్చిందని విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జే గ్యాంగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2015-16 సంవత్సరానికి మద్యం విధానం నిర్ణయం కోసం అప్పటి కమిషనర్ నరేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం కలిసి ప్రభుత్వానికి నోట్ పంపినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో షాపుల సంఖ్యను పెంచుతున్నారని, 10 వేల జనాభాకు ఒక షాపు పెడుతున్నారని, ఆ రాష్ట్రంలో మద్యం ధరలను క్వార్టర్‌పై రూ.30 నుంచి రూ.40 తగ్గించారని, మూడేళ్లుగా వినియోగం తగ్గుముఖంలో ఉందని, ఏపీకి 6 పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందని నోట్‌లో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పాలసీ నిర్ణయం చేయాలని కోరినట్లు బోండా ఉమా తెలిపారు.
ప్రస్తుతం డిప్యుటేషన్‌లో హోదాకు మించిన ఉద్యోగాన్ని చేస్తున్న వాసుదేవ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో కేబినెట్లో చర్చించకుండా ఆ విషయాలపై ఏ నిర్ణయం తీసుకోకుండా మద్యం షాపులపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారని బోండా ఉమా ఆరోపించారన్నారు. ఈయన స్థాయికి కేబినెట్ సమావేశాల మీద 8 ఏళ్ల తర్వాత ఫిర్యాదు ఏమిటనేది ప్రజలు గమనించాలని సూచించారు.. షాపులను ఫిక్స్‌డ్ అద్దెకు లాటరీ పద్ధతిలో కేటాయించాలని, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ మద్యాన్ని అరికట్టాలని విధాన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేబినెట్ తీర్మానంపై అప్పటి ప్రధాన కార్యదర్శి 22 జూన్ 2015న సంతకం చేశారన్నారు.
విశేషం ఏమిటంటే అదే రోజు ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా ఉన్న అజేయ కల్లాం రెడ్డి తానే సంతకం చేసి జీవో నెం.216, తేది.22.06.2015, జీవో నెం.217, తేది. 22.06.2015లను విడుదల చేశారని తెలియజేశారు. ఏదైనా ఒక షాపు నిర్దేశించిన లైసెన్సు ఫీజుపై ఆరు రెట్లకు మించి వ్యాపారం చేస్తే అదనపు అమ్మకాలపై 8 శాతం పన్ను, వ్యాట్ చెల్లించాలని. దీని వల్ల కొన్ని షాపులు ఎమ్మార్పీని మించి అమ్మడం, వేరే షాపులపై ఆర్డరు పెట్టి ఇక్కడ అమ్ముకోవడం లాంటి అవకతవకలకు పాల్పడేవారన్నారు. దీనిని అరికట్టడం కోసమే ఈ ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసినట్లు గుర్తు చేశారు. దానిపై అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర గానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గానీ సంతకమే చేయలేదని, కేవలం ముఖ్య కార్యదర్శి అజేయ కల్లాం మాత్రమే నిర్ణయం తీసుకుని ఆ జీవోను విడుదల చేశారన్నారు. కానీ చంద్రబాబు, కొల్లు రవీంద్ర దానిపై సంతకాలు చేశారని విజయసాయిరెడ్డి, సజ్జల మాట్లాడడం సిగ్గుచేటన్నారు. విధాన పరమైన నిర్ణయాలను తప్పు పడుతూ అక్రమ కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు.
బార్ పాలసీని నిర్ణయించడం కోసం అప్పటి కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాంకు కొన్ని సూచనలు చేస్తూ నోట్ పంపించారన్నారు. నేడు జగన్ రెడ్డి నాసీకరం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. టీడీపీ హయాం కంటే నేడు 4 రెట్లు ధరలు పెంచి నాసిరకం మద్యం అమ్ముతున్నారని దుయ్యబట్టారు. మద్యం షాపుల్లో ఎక్కడా డిజిటల్ ఫేమెంట్స్ లేవని, ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందన్నారు. జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో మద్యంలో లక్ష కోట్లు దోచేశారని, టీడీపీ హయాంలో మద్యంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని బోండా ఉమా మహేశ్వర రావు స్పష్టం చేశారు.