TDP: రాష్ట్రంపై భారీగా చెత్త పేర్చిన జగన్ రెడ్డి.. టీడీపీ సంచలన ట్వీట్
ఏపీలో అధికార విపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో అధికార విపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. వైసీపీ పార్టీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై టీడీపీకి చురకలు అంటిస్తుండగా.. టీడీపీ శ్రేణులు గత ఐదేళ్ల పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై విమర్శలు చేస్తూ టీడీపీ ఓ ఆసక్తికర పోస్టు పెట్టింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి చెత్త కుప్పలుగా పేర్చి పోయాడని, అది తొలగించడానికే ఏడాది సమయం పడుతుందని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. కాకినాడ, హిందూపురం, మచిలీపట్నం, నర్సరావుపేట డంపింగ్ యార్డులలో చెత్త పేరుకుపోయిన ఫోటోలను పోస్టు చేస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా.. రాష్ట్రంపై జగన్ రెడ్డి 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త డంప్ చేసి వెళ్ళాడని, నేడు చంద్రబాబు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించి, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని అన్నది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డంపింగ్ యార్డ్ లలో.. గత 5 ఏళ్ళుగా పేరుకు పోయిన చెత్తని నేడు మొత్తం శుభ్రం చేస్తున్నారని తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి పేర్చిన చెత్త తొలగించడానికే ఏడాది సమయం పడుతుందని రాసుకొచ్చింది.