ఇలాగైతే ఎలా.. ఖర్చుకు వెనుకాడుతున్న టీడీపీ ఇన్​చార్జులు

గత ఎన్నికల తర్వాత సుమారు రెండేళ్ల పాటు టీడీపీ యంత్రాంగంలో స్తబ్దత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తమ్ముళ్లను మరింత కుంగదీసింది.

Update: 2023-04-27 02:02 GMT

దిశ, ఏపీ బ్యూరో: గత ఎన్నికల తర్వాత సుమారు రెండేళ్ల పాటు టీడీపీ యంత్రాంగంలో స్తబ్దత నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తమ్ముళ్లను మరింత కుంగదీసింది. రాజకీయంగా భూస్థాపితమవుతామనే ఆందోళన రేకెత్తించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో కదలిక వచ్చింది. చంద్రబాబు సతీమణిపై అధికార పార్టీ నేతల అనుచిత వ్యాఖ్యలతో క్యాడర్​లో మరింత పట్టుదల పెరిగింది. ఆ తర్వాతి నుంచి చంద్రబాబు కూడా వీలైనన్ని ఎక్కువ పర్యటనలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రతి నియోజకవర్గ ఇన్​చార్జితో లోటుపాట్లపై ముఖాముఖి చర్చించారు. దాదాపు 120 నియోజకవర్గాల్లో సమీక్ష పూర్తి చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలుంటే కూర్చో పెట్టి సమన్వయం చేశారు.

టీటీడీలో చిగురించిన ఆశలు..

కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు ప్రజలు పోటెత్తడంతో మళ్లీ అధికారానికి రావొచ్చనే ఆశలు చిగురించాయి. లోకేష్​ పాదయాత్ర మరింత ఊపునిచ్చింది. ఇక గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమ్ముళ్లలో జోష్​ నింపింది. ఇదే ఒరవడితో జనంలోకి విస్తృతంగా దూసుకెళ్లాల్సిన సమయంలో ఇన్​చార్జులు ఖర్చు దగ్గర వెనకాడుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచే భరించాలంటే కష్టమని ఫీలవుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్ల వ్యవస్థను దెబ్బతీసింది. దీంతో కొందరిని ఆర్థిక పరమైన సమస్యలు వెంటాడుతున్నాయి. అందువల్లే పోటాపోటీగా కార్యక్రమాలను నిర్వహించడంలో వెనుకబడుతున్నట్లు సమాచారం.

టికెట్ వస్తుందో రాదోనని..

జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఇన్చార్జులు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సీటు రాదనే అనుమానంతో ఖర్చుకు వెనుకంజ వేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్​చార్జులు సీటు దక్కుతుందో లేదోనన్న అనుమానంతో వేగంగా కదల్లేకపోతున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో ఇబ్బందులు నెలకొన్నాయి. ఇవన్నీ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి చేరాయి. దీంతో ఏ నియోజకవర్గంలో కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదనే దానిపై దృష్టి పెట్టారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీకి విజయావకాశాలున్నాయనే సంకేతాలను పంపుతున్నారు. అధికార వైసీపీకి దీటుగా నిరంతరం ప్రజల్లో ఉండేట్లు కసరత్తు చేస్తున్నారు.

Tags:    

Similar News