నూజివీడులో టీడీపీకి భారీ షాక్.. సీఎం జగన్‌ను కలిసిన ముద్దరబోయిన

నూజివీడులో టీడీపీకి భారీ షాక్ తగిలింది...

Update: 2024-02-19 13:16 GMT

దిశ, వెబ్ డెస్క్: నూజివీడులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ను ఆయన కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. త్వరలో వైసీపీ గూటికి ముద్దరబోయిన చేరబోతున్నారు.

కాగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆదివారం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. నూజివీడులో తాను ఇంచార్జిగా ఉండగా ఎమ్మెల్యే పార్థసారధి ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే నూజివీడు టికెట్ పార్థిసారథికి టీడీపీ అధినేత ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్థసారథి నియోజకవర్గంలో పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో నూజివీడు టీడీపీ ఇంచార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు కాకుండా పార్థసారథికి ఏ విధంగా సీటు ఇచ్చారో తెలియాలని చెప్పారు. తనకు నియోజకవర్గంలో ఎలాంటి చెడ్డపేరు లేదని.. కానీ ఎందుకు తనకు టికెట్ ఇవ్వడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్థసారథికి సీటు ఇచ్చినట్లు చంద్రబాబు అధికారికంగా చెప్పలేదని తెలిపారు. గతంలో తనకు సీటు ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

అయితే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా గడవకముందే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని జగన్‌కు ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు త్వరలో వైసీపీలో చేరతారని తెలుస్తోంది. 

Read More..

ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడింది జగన్.. దాడిని ఖండించిన మాజీ మంత్రి గంటా 

Tags:    

Similar News