Ap News: టీడీపీ ఇక అన్‌స్టాపబుల్

తెలుగుదేశం పార్టీ మాంచి జోష్‌లో ఉంది. పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో అటు పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు టీడీపీనేతలు కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది...

Update: 2023-03-26 12:55 GMT
  • అధినేత నుంచి గ్రామస్థాయి నేతవరకు ప్రజల్లోనే
  • నిత్యం ప్రజల్లో ఉండేలా రోడ్ మ్యాప్ రూపకల్పన
  • ఈనెల 28న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
  • 29న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్టీ ఆవిర్భావ సభ
  • దిశానిర్దేశం చేయనున్న అధినేత చంద్రబాబు నాయుడు

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ మాంచి జోష్‌లో ఉంది. పట్టభద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో అటు పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు టీడీపీనేతలు కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును టీడీపీ ఒక సంబరంలా జరుపుకుంది. ఈ ఊపుతో ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న నాయకులు, నేతలు కార్యకర్తలు బయటకు వచ్చారు. మరోవైపు నారా లోకేశ్ యువగళంలోనూ నేతలు తళుక్కుమంటున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఇక అన్‌స్టాపబుల్ అని స్టేట్మెంట్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ.. రోడ్ మ్యాప్ వంటి పనుల్లో బిజీబిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో..

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం నింపాయి. ఇప్పటి వరకు నైరాశ్యంలో ఉన్న నేతలను సైతం ఆ ఫలితాలు తట్టిలేపాయి. దీంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో ఇక ప్రజల్లోనే ఉండేలా టీడీపీ నిర్ణయించుకుంది. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పేరుతో ప్రజల్లో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రజల్లో ఉండేలా కార్యచరణ సిద్ధం చేస్తోంది టీడీపీ అధిష్టానం. ఈనెల 28 నుంచి వరుస కార్యక్రమాలకు అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు, సంస్థాగత కార్యక్రమాల మిళితంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్చి 28న హైదరాబాద్‌లో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. సుదీర్ఘ కాలం తరువాత హైదరాబాద్‌లో పొలిట్ బ్యూరో మీటింగ్ నిర్వహిస్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరగనుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ - తీర్మానాలు పెట్టే అంశాలపై చర్చించనుంది. అలాగే టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మార్చి 29న హైదరాబాద్‌లో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సభకు ఏపీ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అలాగే క్లస్టర్ ఇన్‌చార్జి స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ నాయకులు కూడా తరలివెళ్లనున్నారు. వీరందరికీ ఇప్పటికే ఆహ్వానాలు సైతం అందినట్లు తెలుస్తోంది.

ఏప్రిల్‌లో జోన్‌ల సమావేశాలు

ఇదిలా ఉంటే ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాలలో పార్టీ జోన్-1, జోన్ -4, జోన్ -5 సమావేశాలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ జోన్ సమావేశాల అనంతరం అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం అంతా మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రణాళికలు రచించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు... ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహణ, ప్రజా సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి పోరాటాలకు కసరత్తు వంటి అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అధినేత నుంచి గ్రామ స్థాయి నేత వరకు అంతా క్షేత్ర స్థాయిలో ఉండేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తుంది నాయకత్వం. టీడీపీ ఇక అన్ స్టాపబుల్ అని స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ రోడ్ మ్యాప్ రూపొందించేపనిలో పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు వ్యూహరచన చూస్తుంటే మే నుంచి ఇక టీడీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయినట్లేనని తెలుస్తోంది.

Tags:    

Similar News