దోచుకుని..దాచేశారు.. మొత్తం కక్కిస్తా..!
ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకొచ్చిన జగన్ రాష్ట్రాన్ని ముంచి..దోచేశాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు....
దిశ, ఏపీ బ్యూరో: ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకొచ్చిన జగన్ రాష్ట్రాన్ని ముంచి..దోచేశాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గురువారం గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం వైసీపీ నేతలు, కార్యకర్తలకు మేతగా మారిందని, పనులు చేయకుండా బిల్లులు మార్చుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు తిన్నదంతా కక్కించి అరాచకాన్ని అణచివేస్తానన్నారు. హంద్రీనీవా కాల్వను శ్రీశైలం నుంచి రామకుప్పం దాకా తెస్తే..ఐదేళ్లుగా దాన్ని జగన్ పూర్తి చేయలేదని, టీడీపీ అధికారంలోకొచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి నీళ్లందిస్తానని హామీచ్చారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పని చేయాలన్నారు. పేదరిక నిర్మూలనే తన లక్ష్యమన్నారు. గుడుపల్లిలోని ఓట్లన్నీ ఈసారి టీడీపీకే పడాలని చంద్రబాబు కోరారు.
‘సీఎం అవ్వడానికి ఇక్కడికి రాలేదు..ఎమ్మెల్యేగా పిలుపించుకోవాలని రాలేదు..ఈ ఐదేళ్ల వైసీపీ పాలన చూశారు..నా పాలన చూశారు..పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇప్పుడు? మీ దయ వల్ల ఎక్కువ సార్లు నేనే సీఎం అయ్యాను. ప్రతిపక్ష నాయకుడిగానూ ఉన్నాను..నాదే రికార్డు. అలాంటి నాకే రక్షణ లేదంటే ఏంటీ అరాచకం..ఏంటీ నియంతృత్వం..? కుప్పంలో రౌడీయిజం పెరిగింది. వైసీపీ సినిమా అయిపోయింది..ఇక వంద రోజులే మిగిలింది. కుప్పంలో మళ్లీ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తా. పోలీసులకు కూడా ఇక్కడ నేనే దిక్కు. ఐదేళ్లలో మీతో తప్పుడు పనులు చేయించారు తప్ప మీకేమీ చేయలేదు ఈ మహానుభావుడు. మీరు కూడా మనసు చంపుకుని పని చేస్తున్నారు. మీ పిల్లలు, రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరగాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలీసులూ ముందుకు రావాలి.’అని చంద్రబాబు పిలుపునిచ్చారు.