రూట్ మార్చిన టీడీపీ.. జూనియర్ ఎన్టీఆర్ కు జై
దిశ, ఏపీ బ్యూరో: జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ రూట్ మార్చినట్టే కనపడుతుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే థి
దిశ, ఏపీ బ్యూరో: జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ రూట్ మార్చినట్టే కనపడుతుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే థియేటర్ల వద్ద.. ఒకరోజు ముందు నుంచే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావిడి, టీడీపీ వర్గాల హంగామా మొదలైంది. విజయవాడ, విశాఖ జిల్లాలకు చెందిన మైనర్ పట్టణాలలోనూ జూనియర్ కటౌట్లకు దండలు, క్షీరాభిషేకాలు చేయడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి పనుల ద్వారా ఎన్టీఆర్ మావోడు అనే సంకేతాన్ని జనంలోకి బలంగా పంపే ప్రయత్నాన్ని టీడీపీ చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కొద్దిరోజుల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
సినిమా రిలీజ్‌లకు ముందు హీరోల ఫ్యాన్స్ సేవా కార్యక్రమాలు చేయడం, నటులను ఆకాశానికి ఎత్తేయడం వంటివి సహజం. ఇదే ఆర్ఆర్ఆర్ విషయంలోనూ జరిగింది. మరో హీరో రామ్ చరణ్ అభిమానులూ ఇలానే హడావిడి చేశారు. కొన్ని థియేటర్ల వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేశారు కూడా. ఎన్టీఆర్ కోసం టీడీపీ వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం స్పెషల్ అని తెలుస్తున్నది. ఎందుకంటే రాజకీయ కోణంలో చూస్తే ఎన్టీఆర్‌ను టీడీపీలో యాక్టివ్ చేసేందుకు పార్టీ చేస్తున్న ముమ్ముర ప్రయత్నాల్లో భాగంగా దీన్ని చూడాలని విశ్లేషకులు అంటున్నారు. కొంతకాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న ఎన్టీఆర్‌ను మళ్లీ పార్టీ వైపు రప్పించేలా టీడీపీలో ఒక వర్గం ఇప్పటికే చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నదని సమాచారం. రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ సినిమా హాళ్ల వద్ద టీడీపీ వర్గాలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలకు మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు హాజరుకావడం తార్కాణం అని తెలుస్తున్నది.
2009లో మిగతా పార్టీలతో కలిసి టీడీపీ ఏర్పాటు చేసిన మహాకూటమికి స్టార్ క్యాంపెయినర్ జూనియర్ ఎన్టీఆరే. సుడిగాలి పర్యటన చేసి తన వాగ్ధాటితో జనాన్ని ఆకర్షించారు. ఓ ప్రయాణంలో యాక్సిడెంట్ కాగా హాస్పిటల్ బెడ్ నుంచీ పార్టీ కోసం ప్రచారం చేయడం విదితమే. ఆ తర్వాత నుంచి పార్టీలో ఎన్టీఆర్ ప్రాధాన్యం తగ్గించారని పార్టీ సన్నిహితులు పేర్కొంటుంటారు. నిజానికి ఎన్టీఆర్ వివాహానికి పెద్ద మనిషి పాత్రను చంద్రబాబే పోషించారు. ఆ తర్వాత నుంచి పార్టీకే కాస్త దూరంగా ఎన్టీఆర్ ఉంటూ వచ్చారు. ఇక టీడీపీ సైతం ఎన్టీఆర్ పై కాస్త శీతకన్ను వేసిందనే వాదనా లేకపోలేదు. చంద్రబాబు తనయుడు లోకేశ్ కు ఎలాంటి అడ్డూలేకుండా ఎన్టీఆర్‌ను దూరం పెట్టారని విమర్శ టీడీపీపై ఉందన్న విషయం తెలిసిందే. ఆ తరువాత వచ్చిన మహానాడు నుంచి ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా పార్టీ అధినాయకత్వంతో దూరంగానే ఉంటూ వచ్చారు. ఆ మహానాడులో ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ పెట్టకపోవడమే ఆయన కోపానికి కారణం అనే వాదనా ఉంది. తరువాత ఆయన మరణించడం, చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబీకులను ఓదార్చడం ఇవన్నీ చూసిన తర్వాత ఎన్టీఆర్ మళ్లీ పార్టీకి దగ్గరవుతారని అనుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తరపున తమ సొంత అక్కకు టికెట్ ఇచ్చి పోటీ చేయించినా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారానికి రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచడం విదితమే. టీడీపీ ప్రస్తుత నాయకత్వంతో ఎన్టీఆర్ మెంటల్‌గా డిస్ కనెక్ట్ అయిపోయారని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయి.
ఇప్పుడంటే ఆర్ఆర్ఆర్ ను ప్రమోట్ చేస్తున్న టీడీపీలోని కొన్నివర్గాలు గతంలో ఎన్టీఆర్ సినిమాలైన ఊసరవెల్లి, దమ్ము లాంటివి రిలీజ్ సమయాల్లో మాత్రం పట్టించుకోలేదని ఆయన అభిమానులు చెబుతుంటారు. ఎన్టీఆర్ కు టీడీపీకి మధ్య దూరం ఉంటూనే వచ్చింది. కానీ దీనిపై ఎన్టీఆర్ అభిప్రాయం మరోలా ఉంది. తాను ఎప్పటికీ తెలుగుదేశం లోనే ఉంటానని పదేపదే స్పష్టం చేశారాయన. క్రియాశీలక పాత్ర ఎప్పుడు అన్నదానిపై మాత్రం మాట్లాడడం లేదు.
టీడీపీకి ఎన్టీఆర్ అవసరం : టీడీపీలోని ఒక వర్గం
2019 ఎన్నికల్లో టీడీపీ ఎదుర్కొన్న ఓటమి నుంచి పార్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అనేక నాయకులు సైలెంట్ గా ఉంటున్నారు. నారా లోకేశ్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయినా వారికి ఒక స్టార్ క్యాంపెయినర్ అవసరం ఉంది. పార్టీకి అత్యంత కీలకమైన 2024 ఎన్నికల్లో విజయం సాధించాలన్నా, పార్టీ వైపు యువతను పెద్దఎత్తున ఆకర్షించాలన్నా ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ కావాలన్న డిమాండ్ పార్టీ వర్గాల నుంచే ఉందని తెలుస్తున్నది. ఈ వీటన్నింటి నేపథ్యంలో ఎన్టీఆర్‌ను తమ వాడు అని చెప్పుకోవడానికి పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు వేదిక ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అని అందుకే ఎన్నడూ లేనంతగా టీడీపీ వర్గాలు ఈ సినిమా థియేటర్ల వద్ద హడావిడి చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.