బీసీలను జగన్ ఊచకోత కోస్తున్నారు.. అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

బీసీలను జగన్​ సర్కారు ఊచకోత కోస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు....

Update: 2023-11-25 19:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: బీసీలను జగన్​ సర్కారు ఊచకోత కోస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్​’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు ఓ స్వర్ణ యుగం ప్రారంభమైందన్నారు. బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలను టీడీపీ అందించినట్లు తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం బలహీన వర్గాలకు అండగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి జగన్ వరకు ఉక్కు పాదంతో బలహీన వర్గాలను అనిచివేస్తున్నట్లు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

బలహీన వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్యను చంపి, ఆయనకి సంబంధించిన మైన్స్‌ను స్వాధీనం చేసుకొని వైఎస్​ కుటుంబం ఆర్థికంగా బలపడినట్లు అచ్చెన్నాయుడు వ్యక్తం చేశారు. జగన్​ ప్రభుత్వంలో 74 మంది హత్యకు గురైనట్లు ఆయన తెలిపారు. 800 మందిపై అక్రమ కేసులు బనాయించినట్లు పేర్కొన్నారు. 3వేల మందిపై దాడులకు పాల్పడినట్లు చెప్పారు. జగన్ అరాచకాలు, అక్రమాలు, దోపిడీలను ప్రశ్నింస్తుంటే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన వర్గాల వారిని ఆర్థికంగా మెరుగుపరచాలని నాడు అధునాత పనిముట్లు కొన్నామని తెలిపారు. అందులో కొన్ని పంపిణీ చేసామని, ఎన్నికల కోడ్ వల్ల కొన్ని చేయలేకపోయామని పేర్కొన్నారు. మిగిలిన పనిముట్లను బలహీన వర్గాలకు పంచటానికి జగన్‌కు మనసు రాలేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. 

బీసీలకు ఎన్టీఆర్ 24 శాతం రిజర్వేషన్​ కల్పిస్తే.. చంద్రబాబు దాన్ని 34 శాతానికి పెంచినట్లు అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. జగన్​ సర్కారు మళ్లీ దాన్ని 24 శాతానికి కుదించడంతో రాజకీయంగా 16 వేల పదవులను బీసీలు కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. 36 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 రెసిడెన్షియల్ స్కూల్స్‌కు ఒకే జీవోతో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిచ్చినట్లు గుర్తు చేశారు. స్టడీ సర్కిల్స్, విదేశీ విద్యకు అవకాశం కల్పించింది టీడీపీ హయాంలోనేనన్నారు. బీసీల ఫెడరేషన్లు ఏర్పాటు చేసి నిధులిస్తే వాటిని కూడా జగన్​ సర్కారు దారి మళ్లించిందని తెలిపారు. టీడీపీ రూ.5 కోట్లతో జిల్లాకో బీసీ భవన్​ మంజూరు చేస్తే జగన్​ సర్కారు ఒక్కటీ నిర్మించలేదన్నారు. జగన్​ ప్రభుత్వంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం ఉత్సవ విగ్రహాలేనని చెప్పారు. బీసీ కులాల కార్పొరేషన్ల చైర్మన్లు బోర్డులు తగిలించుకొని జగన్​ భజన చేయడం తప్ప ఆయా కులాల ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. అన్ని పదవుల్లోనూ జగన్​ సొంత కులానికే పెద్ద పీట వేసినట్లు తెలిపారు. వెంటిలేటర్​పై కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వానికి బీసీలే పాడె కడతరాని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Tags:    

Similar News