అప్పు కోసం గిరిజనుడి భార్యను అపహరిస్తారా? Varla Ramaiah
ప్రజాస్వామ్యం సమాజంలో వైసీపీ నాయకులు అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గిరిజనుడు సుబ్బరాయుడు భార్య నాగమునిని..
దిశ, ఏపీ బ్యూరో : ప్రజాస్వామ్యం సమాజంలో వైసీపీ నాయకులు అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గిరిజనుడు సుబ్బరాయుడు భార్య నాగమునిని వైసీపీ నాయకుడు అపహరించిన ఘటనపై వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. 'వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం తువ్వపల్లె పంచాయతీలో వైసీపీ నాయకుడైన సుధాకర్ రెడ్డి.. సుబ్బరాయుడు అనే గిరిజనుడి భార్య నాగమునిని అపహరించి తీసుకెళ్లాడు. సుధాకర్ రెడ్డికి చెందిన నర్సరీలో సుబ్బరాయుడు పనిచేస్తున్నాడు. లక్ష రూపాయలు సుధాకర్ రెడ్డి వద్ద అప్పు తీసుకోవడమే వారి పాలిట శాపమైంది. లక్ష రూపాయలకుగాను రూ.2 లక్షలు చెల్లించి తన భార్యను విడిపించుకుపోవాలని సుబ్బరాయుడికి హుకుం జారీ చేశాడు' అని లేఖలో పేర్కొన్నారు. ఈ అమానవీయ ఘటనను చూస్తుంటే రామాయణంలో రావణుడు సీతను అపహరించుకుపోయిన సంఘటన తలపిస్తోంది.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది అని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సమాజంలో ఇలాంటి అనాగరిక చర్యలకు చోటు లేదు అని వర్ల రామయ్య హెచ్చరించారు. కడప పోలీసులు గిరిజనుడికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక వర్గం పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై డీజీపీ వెంటనే స్పందించి సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి. బాధితురాలైన నాగమునికి వైద్య పరీక్షలు నిర్వహించి తగు న్యాయం చేసి బాధిత కుటుంబానికి తక్షణం న్యాయం చేసి పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగించాలి అని డీజీపీని కోరారు. డీజీపీ వెంటనే సుధాకర్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద అరెస్టు చేయాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.