మళ్లీ జగనే.. విజయ రహస్యం అదే !

వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్​ జగనే అధికారాన్ని చేపట్టే అవకాశముందని సంఘ పరివార్​కు చెందిన ‘స్వరాజ్య’మేగజైన్​ ఓ కథనాన్ని ప్రచురించింది.

Update: 2023-06-22 03:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్​ జగనే అధికారాన్ని చేపట్టే అవకాశముందని సంఘ పరివార్​కు చెందిన ‘స్వరాజ్య’మేగజైన్​ ఓ కథనాన్ని ప్రచురించింది. గత ఎన్నికల్లో జగన్​ విజయ రహస్యం ఇదేనంటూ స్టోరీ రచయిత వేణుగోపాల్​ నారాయణన్​ కొన్ని ప్రధాన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం ఓటు బ్యాంకులే మళ్లీ జగన్​ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రస్తుతం ఈ కథనం నెట్టింట హల్​చల్​ చేస్తోంది. సీఎం జగన్​ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాలతోపాటు పాస్టర్లు, ముల్లాలకు గౌరవ వేతనం ఇవ్వడం ద్వారా ఈ వర్గాల్లో మరింత పట్టు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సామాజిక వర్గాలు దూరమవుతాయని భావించే సీఎం జగన్​ బీజేపీతో ఉత్తుత్తి యుద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

స్వరాజ్య మేగజైన్ ​ప్రచురించిన ‘అన్​ కవర్డ్​ జగన్​ మోహన్​ రెడ్డీస్​ సీక్రెట్​ ఫార్ములా ఫర్​ ఎలక్టోరల్​ సక్సెస్​’ అనే కథనం కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 28, ఏడు ఎస్టీ నియోజకవర్గాలను స్వీప్​ చేయడం వెనుక జగన్​ ఐడెంటిటీ పాలిటిక్స్​ బాగా పనిచేశాయని కథనం పేర్కొంది. జగన్​ అధికారానికి వచ్చాక చేపట్టిన నగదు బదిలీ పథకాలు, పాస్టర్లు, ముల్లాలకు గౌరవ వేతనం ఇవ్వడం వల్ల ఈ వర్గాల్లో తమ పట్టును మరింత పెంచుకున్నట్లు వివరించింది. ఈ స్టోరీలో పేర్కొన్న క్రిస్టియన్​, ఎస్సీ జనాభా వివరాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

వారి సంఖ్య 40 శాతం..

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో క్రిస్టియన్ల సంఖ్య ఒక్క శాతమని లెక్కలు చెబుతున్నాయి. స్టోరీలో పేర్కొన్న మరికొందరు రచయితల అధ్యయనం ప్రకారం మొత్తం జనాభాలో 35 నుంచి 40 శాతం క్రిస్టియన్లు ఉండొచ్చని తేటతెల్లమవుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 35 నుంచి 40 శాతం ఉన్నారు. అనంతపురం, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో 25 నుంచి 30 శాతం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 15 నుంచి 20 శాతం ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది.

వారి సంఖ్య పెరగకపోవడానికి కారణమిదే..

2016లో సెంటర్​ ఫర్​ పాలసీ స్టడీస్​ స్కాలర్​ జేకే బాలాజీ వెల్లడించిన వివరాల ప్రకారం 1911–71 మధ్య కాలంలో క్రిస్టియన్ల సంఖ్య పెరిగింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో 4.28 శాతం ఉంటే 2011 నాటికి 1 శాతానికి తగ్గింది. క్రిస్టియన్లంటే బీసీ సీ కేటగిరీ కిందకు వస్తారు. అందువల్ల తాము ఎస్సీలుగా ఉంటేనే రాజ్యాంగం ద్వారా లభించే రిజర్వేషన్లు అందుకోగలమని భావించారు. అందువల్ల జనాభా లెక్కల్లో ఎస్సీలు పెరిగినా క్రిస్టియన్ల సంఖ్య పెరగలేదు. అగ్ర వర్ణాల నుంచి క్రిస్టియన్లుగా మారినా వాళ్లు ఓసీలుగానే జనాభా లెక్కల్లో నమోదవుతున్నారు. 1961లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ జనాభా 5.2 శాతం. క్రిస్టియన్​ జనాభా 13.4 శాతం. అదే 2011 నాటికి ఎస్సీ జనాభా 19.6 శాతం. క్రిస్టియన్​ జనాభా 1.4 శాతమే.

ఈ వర్గాలే జగన్ ను గెలిపించాయి..

ఇక రాష్ట్రంలో ముస్లింలు సుమారు 18 శాతం ఉండొచ్చు. ఎస్టీలు ఆరు శాతం ఉంటారు. మొత్తం ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లతోపాటు రెడ్డి సామాజిక వర్గాన్ని కలుపుకుంటే మళ్లీ జగన్​ మోహన్​ రెడ్డి 50 శాతం ఓట్లతో అధికారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు స్వతంత్ర మేగజైన్​ కథనం వెల్లడిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడం వల్ల ఈ వర్గాలు టీడీపీకి దూరమైనట్లు పేర్కొంది. 2019 ఎన్నికల్లో జగన్​ విజయానికి ఈ వర్గాలే దోహదపడ్డాయంటోంది.

ఎన్నికల వేళ మళ్లీ డ్రామా..

జగన్​ ప్రభుత్వం వచ్చాక ఎంపీల నిధులను చర్చిల నిర్మాణానికి వెచ్చించారు. దీనిపై వైసీపీ రెబల్​ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) ఫిర్యాదు చేశారు. పీఎంవో నుంచి వివరణ ఇవ్వాలని సీఎస్​కు మెమో వచ్చింది. తర్వాత ఏమైందో తెలీదు. నాలుగేళ్ల నుంచి మోడీ ఆదేశిస్తే.. జగన్​ పాటిస్తుంటారనే నానుడిని తొలగించుకోకుంటే ఈ వర్గాలు దూరమయ్యే ప్రమాదముంది. అందుకే మళ్లీ వైసీపీ వర్సెస్​ బీజేపీ అంటూ తెరమీదకు తెస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి ::TDP: జే గ్యాంగ్ ముఠా ఆటకట్టించాల్సిందే!


Similar News