జనసేన-టీడీపీలను ఆదరించండి: నవశకం సభలో నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాలను అంతం చేయడానికి టీడీపీ-జనసేన కలయికను రాష్ట్రమంతా కోరుకుంటోంది అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాలను అంతం చేయడానికి టీడీపీ-జనసేన కలయికను రాష్ట్రమంతా కోరుకుంటోంది అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలను అణగదొక్కాలని అనేక రకాలుగా వైసీపీ ప్రయత్నించింది అని ఆరోపించారు. యువగళం నవశకం సభా ప్రాంగణంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. చంద్రబాబు తన అనుభవంతో పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు అని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుకోసం, రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ముందడుగు వేశారు అని అన్నారు. చంద్రబాబును ములాఖత్‌లో కలిసిన రోజు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై రాష్ట్రమంతా హర్షించింది అని చెప్పుకొచ్చారు. యువగళం ముగింపు సభకు లోకేశ్ మాత్రమే ముఖ్య అతిథిగా ఉంటే బాగుంటుందని మేం భావించాం. కానీ నారా లోకేశ్ పవన్ కళ్యాణ్ తప్పకుండా రావాలి...రాష్ట్ర ప్రజల కోరికను గౌరవించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. ఉపాధి, ఉద్యోగావకాశాల విషయాన్ని పూర్తిగా ప్రక్కనపెట్టింది అని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.
వచ్చేది అద్భుతమైన ప్రభుత్వం
2014లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపించారు అని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవితవ్యాన్ని వెనక్కి నెట్టారు అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర యువత జగన్మోహన్ రెడ్డి పాలనలతో జరిగిన నష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి అని సూచించారు. ఒక్క ఛాన్స్ కు అవకాశం ఇవ్వడం వల్ల ఎంత పొరపాటు జరిగిందో రాష్ట్రమంతా గమనించాలి అని సూచించారు. టీడీపీ-జనసేన పార్టీలు సంయుక్తంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల ముందుకు తెచ్చాయి అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని అన్నారు.రానున్న రోజుల్లో అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం అని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,123కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేశ్‌కు నాదెండ్ల మనోహర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాదయాత్రలో లోకేశ్ సంపాదించిన అనుభవంతో సుపరిపాలన చేస్తారని దృఢమైన నమ్మకం ఉంది.రాష్ట్రప్రజలంతా రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీలను ఆశీర్వదించండి అని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.