ప్రజల్లోకి సూపర్ సిక్స్ : టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యచరణ

తెలుగుదేశం-జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై చర్చ జరిగింది.

Update: 2023-10-23 11:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం-జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై చర్చ జరిగింది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌తోపాటు ఆరు అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. ఉమ్మడి ఐక్యకార్యచరణ, ఉమ్మడి పోరాటం దిశగా ఇరు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఓటర్లను వెరిఫికేషన్‌, ముసాయిదా ఓట్ల పరిశీలన, ఓటర్ల అవకతవకలపై ఉమ్మడి పోరాటం చేయాలని సమన్వయ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా స్థాయి, బూతు స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చారు. వీటితోపాటు నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల పెంపు వంటి అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించారు. సాగునీటి కష్టాలు, కరువు, కృష్ణా జలాల విషయంలో అవకతవకలపై చర్చించారు. అన్నింటికంటే ముందుగా స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని సమావేశం ఖండించింది. అలాగే తదుపరి కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

క్షేత్రస్థాయి వరకు ఉమ్మడి కమిటీల ఏర్పాటు

ఇకపోతే రాజమహేంద్రవరం హోటల్ మంజీరలో టీడీపీ,జనసేన పార్టీల తొలి సమన్వయ కమిటీ సమావేధశం జరిగింది. ఈ సమావేశాలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లు హాజరయ్యారు. తొలుత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయ్యారు. సెంట్రల్ జైలులో చంద్రబాబుతో లోకేశ్ చర్చించిన అంశాలు, చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసిన అంశాలపై అరగంటకు పైగా చర్చించుకున్నారు. అనంతరం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన పార్టీ నుంచి పవన్ కల్యాణ్‌తోపాటు ఆరుగు టీడీపీ నుంచి నారా లోకేశ్‌తోపాటు ఆరుగురు హాజరయ్యారు. మెుత్తం 14 మందితో సమావేశం జరిగింది. టీడీపీ నుంచి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు, సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌, వి. మహేందర్ రెడ్డి, కోటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్‌, బొమ్మిడి నాయకర్‌, పాలవలస యశస్విని హాజరయ్యారు. ఇకపోతే టీడీపీ సభ్యులను ఒక్కొక్కరిని నారా లోకేశ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. అటు జనసేన సభ్యులను సైతం లోకేశ్‌కు పవన్ కల్యాణ్ పరిచయం చేశారు. తొలుత రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.పార్టీల సమన్వయంపై వాడివేడిగా చర్చించారు.అదే తరుణంలో వైసీపీ నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను సమన్వయ సమావేశం ఖండించింది. క్షేత్రస్థాయి వరకు టీడీపీ-జనసేన కమిటీల ఏర్పాటుపైనా చర్చించారు.


మద్దతుగా వెళ్దాం

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌లు ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. అలాగే పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రను సైతం త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాలను ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు కలిసి విజయవంతం చేయాలని సూచించారు.ఈనెల 25 నుంచి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా జనసేన నేతలు కూడా పాల్గొనాలని చర్చించారు. మరోవైపు నవంబర్ 1 నుంచి నారా లోకేశ్ సైతం ఆరు స్కీమ్‌ల పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఈ కార్యక్రమంలో కూడా జనసైనికులు పాల్గొని విజయవంతం చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే పవన్ కల్యాణ్ ఐదో విడత వారాహి విజయయాత్రలో సైతం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాలని కూడా చర్చించారు. ఇకపై ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్తే బెటర్ అని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News