Apaar ID: అపార్ రిజిస్ట్రేషన్లలో సమస్యలు.. ఆ ఒక్క సర్టిఫికేట్ ఉంటే చాలు

అపార్ నమోదుకు ఆధార్ కార్డుని వాడుతుండటంతో విద్యార్థులు తరచూ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

Update: 2024-10-29 09:24 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఉన్న పౌరులందరికీ ప్రధాన గుర్తింపు కార్డుగా ఆధార్ (Aadhar Card) ఉన్నట్లే.. ఒక దేశం, ఒక స్టూడెంట్ కార్డు పేరుతో కేంద్రం అపార్ (Apaar)ను తీసుకొచ్చింది. జాతీయ నూతన విద్యావిధానం-2020లో కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్లలో విద్యార్థులకు సమస్యలు వస్తున్నాయి. అందుకు కారణం పుట్టినప్పటి వివరాలు.. ఆధార్ లో ఉన్న వివరాలు తప్పుగా ఉండటమే. అపార్ నమోదు సమయంలో ఆధార్ కార్డు వాడటంతో.. వాటిలో పేరు, పుట్టినతేదీ, తండ్రి పేర్లు, అడ్మిషన్ రిజిస్టర్, యూడైస్ లతో వేర్వేరుగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి.

విద్యార్థులు ఆధార్ కార్డులో సమస్యల్ని సరిచేసుకునేందుకు అక్టోబర్ 22 నుంచి 25 వరకూ సచివాలయాల్లో ఆధార్ కరెక్షన్స్ నిర్వహించారు. కానీ అక్కడ చిన్న చిన్న సమస్యలను మాత్రమే సరిచేశారు. డేట్ ఆఫ్ బర్త్, తండ్రిపేరు మార్పు వంటివాటికి బర్త్ సర్టిఫికేట్ (Birth Certificate) తప్పనిసరిగా అడుగుతున్నారు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్, గెజిటెడ్ సైన్ ఉన్నా అంగీకరించకపోవడంతో గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 1-10 తరగతుల విద్యార్థులు సుమారు 3 లక్షల పై చిలుకు ఉండగా వారిలో సగానికి పైబడి గ్రామీణ విద్యార్థులే ఉన్నారు. అధికారులు అడిగినవి తీసుకురావడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. వారు నిరక్షరాస్యులు కావడమే ఇందుకు ప్రధాన కారణం.

ఇంటిపేరు మార్చాలన్నా, పుట్టిన తేదీ మార్చాలన్నా బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. అప్పటికప్పుడు అది కావాలంటే దొరకదు. కాబట్టి అపార్ లో నమోదు చేసుకునే విద్యా్ర్థులు.. ఆధార్ లో, స్కూల్ డేటాలో ఉన్న వివరాలన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఇంటిపేరు, పుట్టినతేదీ, తండ్రిపేరు వంటివి తప్పుగా ఉంటే.. ముందే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తో ఆధార్ లో మార్పులు చేయించుకోండి. ఇంటిదగ్గరే ప్రసవం జరిగిన తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అపార్ అధికారిక వెబ్ సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో ఇప్పటి వరకూ 34 కోట్ల మంది స్కూల్, కాలేజీల విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. 

Tags:    

Similar News