ఏపీ వైపు సినీ నిర్మాతల చూపు.. పవన్‌తో రేపు కీలక భేటీ
ఏపీలో ప్రభుత్వం మారడంతో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వం మారడంతో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో సినీ హీరోలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వైఎస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. టార్గెట్ చేసిన నట్టుగానే సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గించి సినిమాలను నష్టాలపాలు చేసింది. దీంతో గత ఐదేళ్లు ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి అడుగులు పడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అందులో సిని ఇండస్ట్రీకి చెందిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ నిర్మాతలు అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ,రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య కలవనున్నారు.
ఇక సోమవారం మధ్యాహ్నం సిని నిర్మాతలు విజయవాడ వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంపై తొలుత శుభాకాంక్షలు చెప్పనున్నారు. అనంతరం జగన్ ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించనున్నారు. అలాగే ప్రస్తుత సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లి సహకారం కోరనున్నారు. ప్రధానంగా సినీ టికెట్ల ధర విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరనునున్నారు. అలాగే థియేటర్ల సమస్యలను పవన్‌కు సినీ నిర్మాతలు వివరించనున్నారు.