Nellore: గంటల వ్యవధిలో దంపతుల మృత్యువాత
భర్త కన్నుమూసిన 24 గంటలు గడవకు ముందే భార్య తనువు చాలించి అందరి కంట కన్నీరు పెట్టించిన ఘటన నెల్లూరు జిల్లా నరుకూరులో చోటు చేసుకొంది...
దిశ, తోటపల్లిగూడూరు: భర్త కన్నుమూసిన 24 గంటలు గడవకు ముందే భార్య తనువు చాలించి అందరి కంట కన్నీరు పెట్టించిన ఘటన నెల్లూరు జిల్లా నరుకూరులో చోటు చేసుకొంది. నరుకూరు దళిత కాలనీకి చెందిన దూపలి వెంకటరమణ(42) డ్యాన్స్ మాస్టర్. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో నరుకూరులో ఉన్న పిన్నమ్మ పాళెపు అరుణమ్మ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యారు. 15 ఏళ్ల క్రిందట విడవలూరు మండలం అలగానుపాడు గ్రామానికి చెందిన సుమలత(35)ను వెంకటరమణ వివాహం చేసుకొన్నారు. పిల్లలు లేకపోవడంతో వెంటరమణ తన భ్యార్య సుమలతను ఎంతో ఇష్టంగా చూసుకొనేవారు. ప్రస్తుతం రమణా వీవెంట్స్ పేరుతో వెంకటరమణ డ్యాన్స్ ప్రోగ్రాలు చేస్తూ తనతో పాటు నలుగురికి ఉపాధి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత కొద్ది కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వెంకటరమణకు పది రోజుల క్రిందట పచ్చకామెర్లు సోకాయి. నెల్లూరు వివిధ వైద్యశాలల్లో చికిత్స తీసుకొన్నప్పటికి నయం కాకపోవడంతో వెంకటరమణను కుటుంబ సభ్యులు చెన్నైలోని రూత్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఇదే సమయంలో వెంకటరమణ భార్య సుమలతకు కామెర్లు సోకడంతో ఆమెను కూడా అదే హాస్పటల్‌కు తరలించి చికిత్స అందించారు. వెంకటరమణ ఆరోగ్య కుదుట పడకపోవడంతో వైద్యుల సూచన మేరకు సోమవారం రాత్రి ఆయనను నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 11గంటల సమయంలో వెంకటరమణ మృతి చెందాడు. డ్యాన్స్ ప్రోగాలతో పాటు రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు దళిత ఉద్యమాల్లో ఎంతో ఉషారుగా ఉండే వెంకటరమణ మృతి చెందడంతో వందలాది మంది మిత్రులు, అభిమానులు నరుకూరు చేరుకొని ఘన నివాళలు అర్పించారు.
ఇది ఇలా ఉండగా బుధవారం ఉదయం నరుకూరులో వెంకటరమణ అంత్యక్రియలు జరుపుతుంగానే మరో దుర్వాత నరుకూరుకు చేరింది. చెన్నైలో చికిత్స పొందుతున్న వెంటరమణ భార్య సుమలత సైతం నీతో పాటే నా పయనం అంటూ బుధవారం ఉధయం 11గంటల సమయంలో మృతి చెందింది. కేవలం రోజు తేడాలోనే భార్యభర్తలిద్దరూ మృత్యువాకిటికి చేరుకోవడంతో నరుకూరులో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ప్రస్తుతం నరుకూరులో ఎవ్వరిని కదిలించినా కన్నీటి పర్వంతమవుతున్నారు.