Srikalahasti: అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా తవ్వకాలు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆనుకుని ఉన్న కైలాసగిరుల్లో విచ్చలవిడిగా మట్టి అక్రమ రవాణా కొనసాగుతుంది......
దిశ, తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం సమీపం కైలాసగిరుల్లో విచ్చలవిడిగా మట్టి అక్రమ రవాణా కొనసాగుతుంది. నిబంధనలకు పాతరేసి కొందరు అక్రమార్కులు మట్టిని విక్రయించి జోబులు నింపుకుంటున్నారు. రాత్రి సమయంలో జరుగుతున్న ఈ అక్రమాలు అధికారులకు తెలిసినా తెలియనట్టుగా వ్యవహరిస్తుండడంతో విమర్శలు తలెత్తుతున్నాయి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయం సమీపం సర్వే నెంబర్ 361, 362 పరిధిలో 5,840 ఎకరాల్లో కైలాసగిరులు వ్యాపించి ఉన్నాయి. కైలాసగిరి ప్రదక్షిణ మార్గం నిర్మించి 3 నెలలైనా కాకుండానే రూపు రేఖలు మారిపోయాయి. ప్రతి రోజు సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు అక్రమార్కులు కొండను తవ్వి మట్టిని తరలిస్తున్నారు. కైలాసగిరుల్లోని రామచంద్రాపురం, రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాలకు దగ్గరలో మట్టి తొలగింపుతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వేడాం, రామాపురం, మిట్ట కండ్రిగ గ్రామాల సమీపంలోనూ మట్టిని తవ్వి విక్రయిస్తూ సిరులు పండించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై కొరడా ఝులిపించాలని కోరుతున్నారు.