HighTention: దమ్ముంటే రండి.... నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ చంద్రశేఖర్ రెడ్డి సవాల్
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి ఓటు వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆయన ఉదయగిరి వస్తే తరిమికొడతామని వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. తనను తరిమికొడతానన్న వాళ్లు ఇప్పుడు రావాలని సవాల్ విసిరారు. దమ్ముంటే ఎవరొస్తారో రండి అంటూ అక్కడే కూర్చున్నారు.
అయితే పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రెండో వర్గం కూడా వస్తే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడుతున్నారని సమాచారం.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. తాను వైసీపీకే ఓటు వేశానని, అయినా తనను సస్పెండ్ చేశారని తెలిపారు. అయితే అప్పటి నుంచి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై ఉదయగిరి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలోని ఫెక్సీలను తొలగించారు. చంద్రశేఖర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పలు సవాళ్లు విసిరారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి వచ్చినట్లు తెలుస్తోంది.