Jagananna Houses: బుచ్చిరెడ్డిపాలెంలో ఇంత అన్యాయమా?
పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగరానికి సంబంధించి కట్టుబడిపాలెం, రామచంద్రపురం, పెద్దూరు జగనన్న లేఔట్‌లో 2 వేల 500 పైగా ఇళ్లు నిర్మిస్తున్నారు...
దిశ, బుచ్చిరెడ్డిపాలెం: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగరానికి సంబంధించి కట్టుబడిపాలెం, రామచంద్రపురం, పెద్దూరు జగనన్న లేఔట్‌లో 2 వేల 500 పైగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం లక్షా 80 వేల రూపాయలు వెచ్చిస్తోంది. అది కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కావడం లేదనే ఉద్దేశంతో.. పనులు నాసిరకంగా చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. సిమెంట్ తక్కువ వేసి నాసిరకం ఇసుకతో తూతూ మంత్రంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా క్యూరింగ్ లేకపోవడంతో సిమెంట్ తెల్లగా పొడిపొడిగా రాలిపోతోందని చెబుతున్నారు.
గోడలపైనే ఏకంగా స్లాబు
ఇక నిర్మాణ శైలి చూస్తే పిల్లర్లు పైవరకు లేకుండా కేవలం ఫ్లైయాష్ ఇటుకలతో కట్టి గోడలపైనే ఏకంగా స్లాబు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 40 వేల రూపాయలు ఇస్తే పై వరకూ పిల్లర్లు వేస్తున్నారని అంటున్నారు. ఫ్లైయాష్ ఇటుకలు కూడా పచ్చిగా ఉండటం, కింద పెడితే పొడి పొడి అవుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల గృహాల నిర్మాణంలో కనీస కట్టడి ప్రమాణాలు కూడా పాటించడంలేదని విమర్శలు చేస్తున్నారు.