కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవలో తిరుమలపెద్దజీయర్‌స్వామి, తిరుమల చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
కల్పవృక్ష వాహనం - ఐహిక ఫల ప్రాప్తి
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు.