ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన: తోట చంద్రశేఖర్
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏపీ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏపీ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మండిపడ్డారు. హామీలు నెరవేర్చలేని జగన్‌ను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. ఏపీకి చెందిన పలు పార్టీల నేతలు ఆదివారం హైదరాబాద్‌లోని తోట క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ నమునాను ఏపీలో అమలు చేయడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఏపీలో బీఆర్ఎస్‌కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు.
టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల అసమర్ధ పాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్యాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించనుందని పేర్కొన్నారు. తెలంగాణాలో జరుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ వర్గాల వారు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో కొవ్వూరు నుండి టి.నాగరాజు, నెల్లూరు నుండి సురేష్, చంద్రా రెడ్డి, నాగరాజు, షేక్ ముజీబ్, తిరుపతి నుండి ధనుంజయ రాజు, సైదాపురం నుండి మల్లిఖార్జున్, రాజంపేట నుండి పునీత్, కిషోర్ రెడ్డి , శ్రీను ,జాకీర్ ,త్రినాద్,కిరణ్ , హేమంత్ ,అభినయ్,గుడివాడ నుండి సాయి తదితరులు ఉన్నారు.