సామాజిక సాధికారత యాత్ర కాదు..జగన్ చేస్తున్న దండయాత్ర: మాజీమంత్రి జవహర్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సామాజిక సాధికరత బస్సు యాత్రపై మాజీమంత్రి కేఎస్ జవహర్ తనదైన శైలిలో స్పందించారు.

Update: 2023-10-26 05:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న సామాజిక సాధికరత బస్సు యాత్రపై మాజీమంత్రి కేఎస్ జవహర్ తనదైన శైలిలో స్పందించారు. అది ప్రజల కోసం జరుగుతున్న సామాజిక యాత్ర కాదని... ప్రజలపై జగన్ చేస్తున్న దండయాత్ర అని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. అసలు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం అభివృద్ది చేసిందని యాత్ర చేస్తున్నారని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లు ప్రజా సంక్షేమాన్ని మరచిన వైసీపీ ఎన్నికలు వచ్చే సరికి సామాజిక సాధికారత గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో యాత్రలు చేసే అర్హత లేదని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. సామాజిక సాధికారత బస్సు యాత్రలో బస్సుకు ఒకవైపు కోడికత్తి శ్రీను ఫోటో... మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ చేతిలో దారుణ హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫోటో పెట్టుకోవాలని సూచించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దళితులపై దాడులకు పాల్పడిన నాయకులను వైసీపీ దూరం పెట్టాలని కోరారు. ఆ తర్వాతే సామాజిక సాధికారత యాత్ర కానీ ఇంకేదైనా యాత్ర కానీ చేపట్టాలని సూచించారు. టీడీపీ హయాంలో ప్రజల కోసం అనేక పథకాలు తీసుకువచ్చామని... వాటిని వైసీపీ అధికారంలోకి రాగానే రద్దు చేసిందని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. 1.40 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయాయో చెప్పాలని మాజీమంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళిత ద్రోహి అని ఆరోపించారు. దళితులపై దాడులు, అవమానకరంగా శిరోమండనాలు... చివరకు ప్రాణాలు తీసిన చరిత్ర వైసీపీ నేతలదేనని మండిపడ్డారు. దళితుల ప్రాణాలు తీసిన వారు, దళితులపై దాడులకు పాల్పడిన వైసీకి సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే అర్హత లేదని మాజీమంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు.

Tags:    

Similar News