స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితం..చంద్రబాబును ఇరికించే కుట్ర : న్యాయవాది సిద్ధార్థ లూత్రా

స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనేది కేవలం రాజకీయ ప్రేరేపితం మాత్రమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అభిప్రాయపడ్డారు.

Update: 2023-09-10 06:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనేది కేవలం రాజకీయ ప్రేరేపితం మాత్రమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అభిప్రాయపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందని అన్నారు. ఏసీబీ కోర్టులో ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లూత్రా తన వాదనలు వినిపించారు. సీఐడీ ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు లండన్ వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. ముందు రోజు రాత్రి 11 గంటలకే చంద్రబాబును చుట్టుముట్టారన్నారు. ఒక వ్యక్తిని చుట్టుముట్టి కదలకుండా చేయడం హక్కుల ఉల్లంఘనేనని లూత్రా వాదించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. సీఐడీ అధికారుల కాల్ డేటాను పరిశీలిస్తే ఎప్పుడూ అరెస్ట్ చేస్తారనేది తెలుస్తోందని వాదించారు. అరెస్ట్ అనంతరం నిబంధనల ప్రకారం దగ్గరలోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచాల్సి ఉందని కానీ సీఐడీ నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదని వాదించారు. చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం అని వాదించారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. పీసీ యాక్ట్ ప్రకారం వారం రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉందని కానీ అలా జరగలేదన్నారు. ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘన కిందకే వస్తాయని లూత్రా తెలిపారు.

సెక్షన్ 409పై వాదనలు

సెక్షన్ 409 నమోదుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూత్రా వాడీ వేడిగావాదించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుందని నిలదీశారు. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని చెప్పుకొచ్చారు. ఇందుకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ కేసులో ఏ 35 గంటి వెంకట సత్య భాస్కర్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని...ప్రస్తుతం చంద్రబాబుకు కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇదే కేసులో కేసులో ఉన్న చంద్రబాబుకు సైతం 409 వర్తిస్తుందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెల్లడించారు. 2021లో కేసు నమోదు అయితే ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఐడీని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు ప్రస్తావించామని ఏఏజీ వెల్లడించారు.

ఎన్నికలున్నాయనే ఇరికించే కుట్ర

మరోవైపు స్కిల్ స్కామ్ కేసులో 2021లో నమోదైన ఈ కేసును సిద్ధార్థ లూత్రా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి అని గుర్తు చేశారు. తీర్పు కూడా రిజర్వ్ అయ్యిందని వాదించారు. ఈకేసు ఎప్పుడో ముగిసింది. నిందితులందరికీ బెయిల్ వచ్చింది అని సిద్ధార్థ లూత్రా స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని..చంద్రబాబును ఇరికించాలనే తిరిగి కేసు ఓపెన్ చేశారు అని సిద్ధార్థ లూత్రా కోర్టులో వాదించారు. చంద్రబాబు నాయుడు హక్కులకు భంగంగ కలిగించేలా సీఐడీ అధికారులు, పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి ఎలాంటి నిబంధనలను సీఐడీ ఫాలో కాలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు సంబంధించి కుటుంబ సభ్యులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమన్నారు. 161సీఆర్పీసీ కింద హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టు సిద్ధార్థ లూత్రా వెల్లడించారు.

Also Read: రాజ్యాంగాన్ని బట్టి నడుచుకోవాలి : చంద్రబాబు అరెస్ట్‌ తీరుపై ఏసీబీ కోర్టు..

Tags:    

Similar News