AP News:అరాచక టీచర్‌కు షోకాజ్ నోటీస్.. కారణం ఇదే!
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల గణిత ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు ప్రవర్తన సరిగ్గా లేదని అధికారుల విచారణలో తేలడంతో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
దిశ, ద్వారకాతిరుమల : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల గణిత ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు ప్రవర్తన సరిగ్గా లేదని అధికారుల విచారణలో తేలడంతో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ముత్యాలరావు తరచు విద్యార్థులను ఇష్టానుసారం కొడుతూ, తిడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈనెల 25న ముత్యాలరావు తమ పిల్లలను చితక్కొట్టాడని గుండే ధర్మరాజు, గుండే మాణిక్యం, మరో వ్యక్తి ద్వారకాతిరుమలకు వచ్చిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓ పరసా వెంకట్రావును డీఈఓ వెంకటలక్ష్మమ్మ విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి, ఎంఈఓ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ముత్యాలరావు ప్రవర్తన సరిగ్గా లేదని విచారణలో తేలడంతో క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో వచ్చేనెల 4లోపు వివరణ ఇవ్వాలని డీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇదిలా ఉంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ముత్యాలరావు ఒక విద్యార్థిని తిడుతున్నప్పుడు తీసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది.