రాజధానిలో వైసీపీకి షాక్: టీడీపీలోకి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి?
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజకీయ భవితవ్యం ఏంటి?
దిశ, డైనమిక్ బ్యూరో : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజకీయ భవితవ్యం ఏంటి? వైసీపీలో కొనసాగకూడదనే నిర్ణయానికి ఉండవల్లి శ్రీదేవి దాదాపు వచ్చేశారా? టీడీపీలో చేరతారా? వైసీపీ నుంచి సస్పెండ్ వేటుకు గురైన ఉండవల్లి శ్రీదేవి ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆమె ఉన్నట్లుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలవడం వెనుక ఉద్దేశం ఏమిటి? టీడీపీలో చేరుతున్నట్లు పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్లేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు నాయుడిని కలిసి తన మనసులో మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అంశంపైనా ఎలాంటి క్లారిటీ రాలేదని తెలుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో పార్టీలో తనకు ఇచ్చే గుర్తింపు ఏమిటి? ఎమ్మెల్సీలాంటి పదవులు ఏమైనా ఇస్తారా? అనేదానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అందువల్లే ఆమె తన నిర్ణయాన్ని యువగళం పాదయాత్ర తాడికొండలో చేరే వరకు ప్రకటించనని తేల్చి చెప్పేశారు. ఈలోగా టీడీపీ నుంచి ఏదైనా హామీ లభిస్తే టీడీపీలో చేరనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెుదట్లో భజనపరురాలిగా
ఉండవల్లి శ్రీదేవి దంపతులు వైద్యులు. స్వతహాగా వైద్యులు అయిన ఈ దంపతులు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వీరికి వైఎస్ జగన్ సైతం కొండంత అండగా నిలిచారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో టికెట్ సైతం ఇచ్చారు. తాడికొండ నియోజకవర్గం అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవిని ప్రకటించడంతోపాటు ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. అంతేకాదు వైసీపీ అధికారంలోకి సైతం వచ్చేసింది. పోటీ చేసి గెలుపొందిన తొలిసారే ఆమె అసెంబ్లీకి అడుగు పెట్టడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. అంతేకాదు వైసీపీలో కీ రోల్ పోషించారు. అదే తరుణంలో వైఎస్ జగన్ దృష్టిలో పడేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలపై పొగడ్తల వర్షం కురిపించే వారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ జగన్‌కు ఓ భజన పరురాలిగా మారారు. ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై చేసిన వ్యాక్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్య శ్రీ ద్వారా ఆగి పోయిన గుండె బైపాస్ సర్జరీ తర్వాత మళ్లీ కొట్టుకుంటే అది లబ్ డబ్ అని కాకుండా జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పులివెందుల నియోజకవర్గంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులి లాంటి జగన్ అన్న పుడతాడని ముందే ఊహించి.. ఆ ఊరికి పులివెందుల అని పేరు పెట్టారంటూ తెగ ప్రశంసలు కురిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఉండవల్లి శ్రీదేవిని ఓ భజన పరురాలిగా ట్రోల్ చేశారు.
క్రాస్ ఓటింగ్ అంటూ వేటు
తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌కు కొంత గ్యాప్ వచ్చింది. తన నియోజకవర్గంలో నందిగం సురేశ్ జోక్యం చేసుకుంటున్నారని ఆమె బహిరంగంగా విమర్శలు చేశారు. అంతేకాదు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.ఇదే తరుణంలో పలు సర్వేల్లో ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో నియోజకవర్గం ఇన్‌చార్జిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించడం ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో నియోజకవర్గంలోని వైసీపీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి వర్గాలుగా విడిపోయాయి. చివరకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనని ప్రచారం జరిగింది. దీంతో ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ముందుకు కుమార్తెతో కలిసి సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు.టికెట్‌పై చర్చించారు. అయితే టికెట్ ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పడంతోపాటు భవిష్యత్‌పై ఎలాంటి హామీ చేయలేదు. అంతే ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం..టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ఉండవల్లి శ్రీదేవిపై వేటు వేసింది. దీంతో ఆమె అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సవాల్ సైతం చేసిన సంగతి తెలిసిందే.
టీడీపీలో చేరే ఛాన్స్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం ఆమె ఇంటిపైనా, కార్యాలయంపైనా వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో ఆమె హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. తాడికొండలో అడుగుపెట్టడం మానేశారు. తాడికొండ వస్తే తనను చంపేందుకు ప్రయత్నిస్తారంటూ ఆమె ఆరోపిస్తూ హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. దీంతో ఆమె రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనభద్ర వద్ద చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏపీలో టీడీపీ హవా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తనకు రక్షణ కల్పించాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ‘నేను కష్టాల్లో ఉండి, కన్నీరు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాకు మద్దతుగా నిలిచారు. వైసీపీ గూండాలు, కార్యకర్తలు నా మీద, నా ఆఫీస్ మీద దాడి చేశారు. తీవ్రభయాందోళనలకు గురి చేశారు. రాష్ట్రంలో ఉండాలంటేనే వణికి పోయేలా చేశారు.ప్రాణభయంతో హైదరాబాద్‌లో ఉంటున్నాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు కలిశాను’ అని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ‘ఈ నాలుగున్నర నెలల్లో ఏ పార్టీలో చేరాలి. ఏం చేయాలనేది ఆలోచించాను. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి రావడం...టీడీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరిగింది గుర్తించాను. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపైనా బేరీజు వేసుకున్నా. కానీ చంద్రబాబు చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. వైసీపీ పాలనలో అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. రానున్న ఎన్నికల్లో వీటన్నింటికీ ప్రతిఫలం ప్రజలే చూపిస్తారు’ అని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరాలి అనేది త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తాడికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. దీంతో ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. మరి లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు...?చంద్రబాబు ఎలాంటి భరోసా ఇస్తారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.