వై నాట్ ఆల్ అవుట్.. పార్టీ మారనున్న మరో ఏడుగురు రాజ్యసభ ఎంపీలు?

వై నాట్ 175 అంటూ.. విర్రవీగిన వైసీపీకి అత్యంత గడ్డు రోజులు వచ్చాయి.

Update: 2024-08-30 02:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: వై నాట్ 175 అంటూ.. విర్రవీగిన వైసీపీకి అత్యంత గడ్డు రోజులు వచ్చాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆ పార్టీ.. పతనావస్థకు చేరువ అవుతోంది. అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులకే పరిమితమైంది. శాసనమండలిలో, రాజ్యసభలో తమకు మెజారిటీ సభ్యులు ఉన్నారులే.. వారితో రాజకీయ చక్రం తిప్పవచ్చు.. అనుకుంటున్న పార్టీ అధినేత జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులు, కీలకమైన వారు పార్టీని వీడుతున్నారు. తాము ఎంతో కాలంగా అసంతృప్తితో ఉన్నా అధిష్టానం పట్టించుకోలేదంటూ మోపిదేవి వెంకటరమణ వంటివారు సంచలన వ్యాఖ్యలు చేసి మరీ వెళ్లిపోతున్నారు. వైసీపీ అనే నావకు చిల్లు పడిందని.. తక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా మునిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎవరు ఏ పార్టీలోకి..

రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు గురువారం మధ్యాహ్నం వైసీపీకి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్కడ్ కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. మిగిలిన వైసీపీ ఎంపీలు కూడా అదే బాటలో నడుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీలోకి మోపిదేవి, గొల్ల బాబూరావు, మస్తాన్‌రావు, బీజేపీలోకి రఘునాథ్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని, జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్య వెళ్తారని సమాచారం. వీరితో పాటు ఎన్డీఏ కూటమిలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాజ్యసభలో వైసీపీ ఖాళీ అయినట్లే. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మినహా వైసీపీకి రాజ్య సభలో ఎవరూ మిగిలేలా లేరు.

ఎన్డీఏ వ్యూహంలో భాగమేనా?

రాజ్యసభలో వైసీపీకి చెందిన 11 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకు వారి మద్దతు తప్పనిసరి. జగన్ కొంత ధీమాగా ఉండడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. గత ఐదేళ్లలో రాజ్యసభలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎటువంటి బిల్లులకైనా వైసీపీ సభ్యులు బేషరతుగా మద్దతు తెలిపారు. ఎన్నికల తర్వాత సీన్ మారింది. ఢిల్లీలో ధర్నా చేపట్టిన సమయంలో జగన్‌కు ఇండియా కూటమి నేతలు మద్దతు తెలిపారు. ఆ తర్వాత వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఓ చట్ట సవరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా దానిని వైసీపీ సభ్యులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎన్డీయే తలుపులు తెరిచినట్లు సమాచారం. వారు రాజీనామా చేస్తే ఉపఎన్నికల్లో ఆ స్థానాలను కూటమి పార్టీలు పంచుకునే చాన్స్ ఉంది.

నన్ను పట్టించుకోలేదు: మోపిదేవి

వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలున్నాయని చెప్పారు. రాజీనామా నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నదని కాదని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని జగన్‌తో చెబితే.. ఏమాత్రం ఆలోచించకుండా కుదరదని చెప్పారన్నారు. అప్పటినుంచి అసంతృప్తిగా ఉన్నానని, ఆ సమయంలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తాను జగన్ ​కోసం ఎన్నో త్యాగాలు చేశానని తెలిపారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేసినట్లు ఎంపీ బీద మస్తాన్‌రావు తెలిపారు. కుటుంబ సభ్యులు, అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.


Similar News