ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల పొత్తులపై సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల పొత్తులపై సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు పొత్తులపై సైలెంట్‌గా బీజేపీ ఒక్కసారిగా ఎన్నికల సన్నాహకాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. చర్చల అనంతరం బీజేపీ కీలక నేత సత్యకుమార్ మాట్లాడుతూ.. తమకు పొత్తులు అవసరం లేదని, ఒక వేళ తమతో పొత్తు కోరుకునే వాళ్లు చర్చలకు రావాలని అన్నారు. తాము ఇప్పటికే పవన్‌తో కలిసి ముందుకు వెళ్తున్నామని, అయితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని పేర్కొన్నారు. మేము ఎవరితో కలవాలని పవన్ అనుకుంటున్నారో.. ముందు ఆ పార్టీ నుంచి స్పందన రావాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పొత్తులపై అంతిమ నిర్ణయం బీజేపీ అధినాయకత్వానిదేనని ఆయన సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతకు ముందు ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికలు, టీడీపీతో పొత్తుతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు, ఏపీలో పొత్తులపై ఎలా వెళ్లాలనే అంశంపై కోర్ కమిటీ సభ్యులు.. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒంటరిగా వెళ్లడం కన్నా పొత్తుతోనే వెళ్లాలని మెజారిటీ సభ్యులు కేంద్ర బీజేపీ కోర్ కమిటీకి అభిప్రాయం వ్యక్తం చేశారు.