Chandrababuకు అంత సీన్ లేదు: Sajjala Ramakrishna Reddy
దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, Latest Telugu News
దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో విధ్వంసకర ఘటనలకు చంద్రబాబు నాయుడే ప్రథమ ముద్దాయి అని ఆయనే బాధ్యుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు బోన్‌లో నిలబడి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబేనని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కుప్పంలో టీడీపీ బరితెగించిందని, చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో టీడీపీ నేతలు కర్రలతో ఊరేగింపుగా వెళ్లి దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. అసలు ఊరేగింపుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు కర్రలు ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
దౌర్జన్యాలు చేసేది మీరే ఏడ్చేది మీరే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు జెండాలు కట్టుకోవడం ఆహ్వానించదగ్గ విషయమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే అదే సమయంలో వైసీపీ జెండాలు పీకాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అంటే కావాలనే గొడవలు సృష్టించేందుకు కాదా అని సజ్జల ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రథమ ముద్దాయిగా బోన్‌లో నిలబడాలంటూ మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు సంజాయిషి ఇవ్వాలని నిలదీశారు.
అలా చేయకుండా మొగుడిని కొట్టి మొగశాలకు ఎక్కినట్లు..దాడి వారే చేసి ఏడుపు అందుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పర్యటనలో దౌర్జన్యాలకు పాల్పడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని.. పైకి మాత్రం ఏమీ ఎరగనట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. హింసను ప్రేరేపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలను రాష్ట్ర ప్రజానీకం చూస్తూనే ఉందని సజ్జల అన్నారు. చంద్రబాబు బ్యానర్లు కట్టడం, వైసీపీ బ్యానర్లు చించివేయడం, మరోవైపు వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఎంతవరకు సబబు అనేది చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.
చంద్రబాబూ! నీకిది తగునా?
కుప్పంలో చంద్రబాబు తొలిరోజు పర్యటనలో చోటు చేసుకున్న దాడులను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు బూతులు మాట్లాడుతారా అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ఎంపీడీవో కార్యాలయం, వైఎస్‌ఆర్ విగ్రహంపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే ఎంపీపీ అశ్వినిపై కూడా దాడికి పాల్పడటం అత్యంత బాధాకరమని సజ్జల అన్నారు. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అని నిలదీశారు. 'చంద్రబాబు అండ్ టీంకు ఏ హక్కు ఉందని దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ప్రజలను రెచ్చగొట్టి సానుభూతి పొందాలనుకోవడం దుర్మార్గమన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి దుర్మార్గాలు అవసరమా అని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచి..ఇంతకాలం ఉక్కు పాదంతో నొక్కి పెట్టిన చంద్రబాబు..వైసీపీ అధికారంలోకి వచ్చాక అది బ్రేక్ అయ్యింది. వైఎస్ జగన్ పాలనలో నిజమైన అభివృద్ధి, సంక్షేమం ఎట్లా ఉంటుందో తొలిసారి కుప్పం ప్రజలు రుచి చూశారు. అప్పటి నుంచి వైసీపీకి నియోజకవర్గంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
వైసీపీ అఖండ విజయం సాధించడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబు కబంధ హస్తాల నుంచి స్వేచ్ఛగాలులు పీల్చడం మొదలుపెట్టారు. ఎంపీటీసీ ఎన్నికల్లో 65 స్థానాలకు 63 చోట్ల, కుప్పం మున్సిపాలిటీ కూడా వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. కుప్పం జనం విసిగిపోయి చంద్రబాబును చెత్త బుట్టలో పడేశారు. కుప్పంలో చంద్రబాబుకు స్థానం లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు. కుప్పానికి 30 ఏళ్లు పసుపు రంగు పులిమారు. ఇప్పుడు మూడు రంగుల వైసీపీ జెండా ఎగురుతుండటంతో జీర్ణించుకోలేకపోతున్నారు' అని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గురువారం చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదని విమర్శించారు. చంద్రబాబు ఇకనైనా భ్రమలు వీడి వాస్తవంలోకి రావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
చంద్రబాబు చెప్పింది అమలు చేయడమే పవన్ స్ట్రాటజీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య రహస్య బంధం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా ముసుగు తీసేయాలని సూచించారు. ఇద్దరూ కలిసే పని చేస్తున్నారని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ కల్లు మూసుకుని మాట్లాడుతున్నారని... ఎన్నికల స్ట్రాటజీ రహస్యం అంటూ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని పవన్ అంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలన్నీ తొలగించాలని పవన్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్, చంద్రబాబులు ప్రయత్నిస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు చెప్పినది అమలు చేయడమే పవన్ కల్యాణ్ అసలైన స్ట్రాటజీ అని సజ్జల అన్నారు. పవన్ కల్యాణ్ సినీ గ్లామర్ పరంగా హీరో అయితే.. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి రియల్ హీరో అయ్యారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.