సీఎం జగన్‌కు హైకోర్టులో భారీ షాక్.. సైనిక్ దళ్ పిటిషన్‌పై విచారణకు గ్రీన్‌సిగ్నల్
కోడి కత్తి కేసులో శ్రీను కుటుంబానికి సైనిక్ దళ్ అండగా నిలిచింది. ...
దిశ, వెబ్ డెస్క్: కోడి కత్తి కేసులో శ్రీను కుటుంబానికి సైనిక్ దళ్ అండగా నిలిచింది. శ్రీను బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడి కత్తి శ్రీను పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్ సోమవారం ఉదయం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడి కత్తి దాడి కేసులో ఐదేళ్లుగా శ్రీనుకు బెయిల్ రావడంలేదని.. ఆయన జైల్లోనే మగ్గిపోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి చెప్పేలా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేకాదు శ్రీను కుటుంబ సభ్యుల దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను కోర్టుకు వివరించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అటు వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
కాగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో శ్రీను దాడి చేశారు. ఈ దాడిలో జగన్ భుజంపై గాయమైంది. చికిత్స పొందడంతో ఆయనకు అయిన గాయం మానిపోయింది. అయితే ఈ కేసులో శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనకు బెయిల్ రావడంలేదు. ఇటీవల ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పాలని కోర్టు ఆదేశించింది. అయితే ఏదో ఒక కారణంతో సీఎం జగన్ కోర్టుకు వెళ్లడంలేదు. దీంతో శ్రీను కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి మద్దతు పెరుగుతోంది. శ్రీను తల్లి, సోదరుడిని కలిసిన సైనిక్ దళ్ అధ్యక్షుడు , ప్రముఖ న్యాయవాది పాలేటి మహేశ్ సంఘీభావం ప్రకటించారు.