Palnadu politics:‘సై..అనడం లేదు’.. పల్నాడులో చప్పబడ్డ పాలిటిక్స్!?

ఢీ అంటే ఢీ అనడాలు లేవు..సై అంటే సై సై అనడం అసలే లేదు. మాటకు మాట వినిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ముగిసే సరికి పల్నాడు రాజకీయాలు చప్పబడ్డాయి.

Update: 2024-10-03 12:13 GMT

దిశ, పల్నాడు: ఢీ అంటే ఢీ అనడాలు లేవు..సై అంటే సై సై అనడం అసలే లేదు. మాటకు మాట వినిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ముగిసే సరికి పల్నాడు రాజకీయాలు చప్పబడ్డాయి. కీలక నేతలు ఉన్నా జిల్లాలో రాజకీయాలు క్రియాశీలకంగా లేవు. ఇరు పార్టీల నేతలు సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. దీంతో ముఖ్యమైన అంశాల్లో మాట్లాడే నేతలే కరువయ్యారు. ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా వినిపించిన పల్నాడు పేరు వంద రోజుల్లోనే పాల పొంగులా చల్లారిపోయిందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

పల్నాడు ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. దూకుడైన రాజకీయాలకు పెట్టింది పేరు. గత ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రాంతం దేశ వ్యాప్తంగా పేరు పొందింది. అయితే గత కొంతకాలంగా రాజకీయాల్లో స్థబ్దత ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. ఎందరో సీనియర్ నేతలు ఇక్కడ నుండి చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎస్ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ వంటి నేతలు అనేక సార్లు అసెంబ్లీకి ఎన్నికైన వారే.. అదే విధంగా వైసీపీ నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు వంటి సీనియర్ నేతలున్నారు. అయితే ఈ జిల్లా నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో ఎవరికి మంత్రి పదవి దక్కలేదు.

ఎవరికి వారే యమునా తీరే..

దూకుడైన రాజకీయాలకు పెట్టింది పేరైన పల్నాడులో ఎన్నికలు అవగానే వినుకొండలో రషీద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రెండు పార్టీల నేతలు ఈ హత్య పై ఆరోపణలు చేసుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలైన తర్వాత మొదటిసారి వినుకొండ లోనే పర్యటించారు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు చల్లబడ్డాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తర్వాత బెంగళూరు వెళ్లిపోయారు. అయితే ఆయన్నే పల్నాడు జిల్లా వైసీపీ అద్యక్షుడిగా కొనసాగిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. పిన్నెల్లి అందుబాటులో లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యం కావడం లేదు. దీంతో ఎవరికి వారు తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. మరోవైపు పెదకూరపాడు, చిలకలూరిపేట గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు నియోజకవర్గాలకే వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంది పరిస్థితి.

మంత్రి పదవి రాకపోవడంతో..

ఇక ఇటు టీడీపీలోనూ ఇదే స్థితి కొనసాగుతోంది. సీనియర్ నేతలు మంత్రి పదవుల పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఎవరికి వారే నియోజకవర్గాలకు పరిమితం అయ్యారు. లడ్డూ వివాదంలో కూడా నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడకపోవడం పై క్యాడర్ లో అసంతృప్తి కనిపిస్తుంది. జిల్లా స్థాయిలో అధికార పార్టీని ముందుండి నడిపించే వారే కరువయ్యారన్న వాదన వినిపిస్తోంది. సీనియర్ నేతలు సైతం తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ జిల్లా స్థాయి కార్యక్రమాల్లో మాత్రం మనకెందుకులే అన్నట్లు ఉంటున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. దీంతో ఎన్నికల వరకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమున్న జిల్లాగా ఉన్న పల్నాడు ఒక్కసారిగా రాజకీయంగా చప్పబడిందని విశ్లేషకులు సైతం అంటున్నారు. మంత్రి పదవి రాకపోవడంతో టీడీపీలో సరైన నాయకత్వం లేకపోవడంతో వైసీపీలో స్తబ్దత ఏర్పడిందని ఆయా పార్టీల కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకేం విధంగా ఉంటుందో అన్న ఆవేదన ఆయా పార్టీల్లో క్యాడర్ లో కనిపిస్తుంది. దీనిపై ఆయా పార్టీల అధినేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Similar News