‘కేంద్రం నుంచి ఏపీకి రూ.3,796 కోట్లు’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,796 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,796 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు. ఈ మొత్తం దేశంలోని 28 రాష్ట్రాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్రత్యేక సహాయ స్కీమ్‌లో భాగంగా మంజూరైన మొత్తం రూ.85,877 కోట్లలో భాగం అని తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల దీర్ఘకాలిక, 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని ప్రతిపాదించారు. 2022-23కి సంబంధించిన రుణ మొత్తాన్ని వివిధ రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో వారి వాటాకు అనులోమానుపాతంలో కేటాయించారు. ఈ నిధిని మంజూరైన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఏపీకి మంజూరైన మొత్తంలో ఎక్కువ భాగం విద్య, ఆరోగ్య రంగాల్లో మూలధన పెట్టుబడులకు వినియోగిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 26 జిల్లాల్లో పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్ "మన బడి నాడు నేడు" ఫేజ్-2 అమలు కోసం రూ.1,738 కోట్ల భారీ మొత్తం మంజూరు చేశామన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భవనాల నిర్మాణం, పరికరాల కొనుగోలు, చాలా జిల్లాల్లో రెండో పీహెచ్‌సీ భవనాల నిర్మాణానికి మరో రూ.1504 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన రూ.554 కోట్లు YSR జిల్లాలో పారిశ్రామిక నీటి సరఫరా మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ కోసం ఆమోదించబడ్డాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయ ఆర్థిక సహాయం అందించడంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానిస్తూ 'నాడు నేడు' కింద ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలకు సామాజిక మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడంలో ప్రధాన మంత్రి మోడీ ఉదారంగా ఆర్థిక సహాయం చేశారన్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, విద్యా రంగాలలో పెట్టుబడి పెట్టేందుకు ఏపీకి పెద్దపీట వేసినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందని, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. వివిధ పథకాలు మరియు ప్రాజెక్టుల కింద రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌లో కనిపించే అభివృద్ధి అంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.