రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు మళ్లించారనడం దుష్ప్రచారం : అచ్చెన్నాయుడు
స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయ పార్టీకి రూ.20 వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లైతే అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సదరు పార్టీ వారు తెలియజేస్తారు అని చెప్పుకొచ్చారు. అవి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. ‘ఏప్రిల్ 2023లో ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సీఐడీ అధికారికంగా డౌన్ లోడ్ చేశారు. అందులోనే ఎవరు ఏ రోజు ఎంత మొత్తంలో విరాళాలిచ్చారో స్పష్టంగా ఉంది. వాటిపై ఆరు నెలల పరిశోధన చేసిన సీఐడీ, ఎలాంటి అవకతవకలు లేకున్నా బురద జల్లడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెప్పడం, దానిని అక్రమ కేసులకు ముడిపెట్టడం దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం’ అని అచ్చెన్నాయుడు అన్నారు.
కేంద్రచట్టాలను అపహాస్యం చేస్తున్న జగన్
2018-19లో టీడీపీ ఖాతాకు రూ.27 కోట్లు ఎలక్షన్ బాండ్ల రూపంలో వచ్చాయని వస్తున్న ఆరోపణలను అచ్చెన్నాయుడు ఖండించారు. అదే సంవత్సరంలో అవే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వైసీపీ ఖాతాకు రూ.99.84 కోట్లు, 2019-20లో రూ.74.35 కోట్లు, 2020-21లో రూ.96.25 కోట్లు, 2021-22లో రూ.60 కోట్లు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. ఈ విరాళాలిచ్చిన వ్యక్తులు, సంస్థల పేర్లు జగన్ తన సొంత పత్రికలో ప్రచురించే దమ్ము ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? అని ఛాలెంజ్ చేశారు. 6 నెలల క్రితం ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి సేకరించినట్లు నీ పంచనామా నివేదిక చెబుతోంది. ఆరు నెలల పరిశోధన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరక్క ఇప్పుడు కోర్టు ముందు పెద్ద మొత్తంలో నగదు వచ్చిందని అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆరు నెలల్లో ఏం ఆధారాలు కనిపెట్టారో కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేసేందుకు, ఆయన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేందుకు దర్యాప్తు సంస్థలు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న కుట్ర మాత్రమేనని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ సేకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ చట్టం కూడా చేసింది అని గుర్తు చేశారు. కానీ జగన్ రెడ్డి వాటిని కూడా తప్పుబడుతూ, అదో కుంభకోణం అన్నట్లుగా మాట్లాడుతూ కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తున్నాడు అని మండిపడ్డారు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి ఉంచడానికి కుట్ర చేస్తున్నారని ఈ వ్యాఖ్యలతోనే అర్ధమవుతోంది అని ఆరోపించారు. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ద్వారా ప్రజాహక్కుల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.