రోడ్లు వేశాం.. రోడ్డున పడ్డాం : విజయవాడలో కాంట్రాక్టర్ల ఆందోళన

ఏపీలో కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. రహదారుల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని విజయవాడలో ధర్నాకు దిగారు.

Update: 2023-11-22 10:07 GMT

దిశ , డైనమిక్ బ్యూరో : ఏపీలో కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. రహదారుల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని విజయవాడలో ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. వీరు చేస్తున్న ఆందోళనలకు రాష్ట్ర బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సైతం మద్దతు పలికారు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, డోన్‌ నియోజకవర్గాల్లోనే బిల్లుల చెల్లింపు చేస్తున్నారని మిగిలిన ప్రాంతంలో వారికి చెల్లించడం లేదని ఆరోపించారు. బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నా అది ఫలించడం లేదన్నారు. ఆర్థికశాఖ అధికారి సత్యం చెప్పేవన్నీ అసత్యాలేనని కాంట్రాక్టర్లు మండిపడ్డారు. కాంట్రాక్టర్లను రక్షించాలి అంటూ ఈ సందర్భంగా ఆందోళన కారులు నినాదాలు చేశారు. రోడ్లు వేశాం.. రోడ్డున పడ్డాం అంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు వేసేందుకు తమ ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేశామని ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి రోడ్డున పడిందని విలపించారు. తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని..అలాగే దీర్ఘకాలిక పెండింగ్‌ బిల్లులను సైతం తక్షణమే విడుదల చేసేలా అధికారులకు సీఎం వైఎస్ జగన్ హామీ ఇవ్వాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News