Pawan Kalyan యాత్రకు అడుగడుగునా ఆంక్షలు.. జనసైనికుల ఆగ్రహం
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న మూడో విడత వారాహి విజయ యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధిస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న మూడో విడత వారాహి విజయ యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధిస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక ఆంక్షలు పెడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. గురువారం మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇవ్వడంపై ధ్వజమెత్తుతున్నారు. అంతేకాదు విమానాశ్రయం ఆవరణలో ర్యాలీలకు అనుమతి నిరాకరించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మధ్యాహ్న సమయంలో సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందంటూ పవన్ వెళ్ళే రూట్ మ్యాప్‌లో మార్పులు చేర్పులు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి షీలా నగర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ నుంచి టూ టౌన్ మీదుగా వెళ్లాలని పోలీసుల షరతులు విధించడంపై విరుచుకుపడుతున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ తాటి చెట్ల పాలెం న్యూ కాలనీ మీదుగా సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం పవన్ కల్యాణ్‌ను ఎవ్వరు చూడకూడదని లూప్ లైన్ రూట్‌లో పంపాలని పోలీసులు ప్రయత్నమని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సింగిల్‌గానే పోటీకి సై.. ఎన్నికల వేళ ఆశావాహుల్లో పొత్తుల టెన్షన్!