Prakasam barrageలో నిలిచిపోయిన బోట్ల తొలగింపు

ఆగస్టు నెల చివర్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది.

Update: 2024-09-14 15:35 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు నెల చివర్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఈ నదిపై ఉన్న అన్ని ప్రాజేక్టులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశాయి. ఈ క్రమంలో కృష్ణా నదిపై ఉన్న చివరి.. బ్యారేజ్ అయిన ప్రకాశం బ్యారేజీకి భారీ వరద పోటెత్తింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో 70 గేట్లను పూర్తి స్థాయిలో పైకి ఎత్తి పెట్టి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో నదిలో ఉన్న ఇసుక బోట్లు నది ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చి బ్యారేజీ లోని 67, 68, 69 వ గేట్లను బలంగా ఢీ కొట్టి గేట్లకు అడ్డం పడ్డాయి. దీంతో వరద ప్రవాహం కొనసాగుతుండగా.. బోట్లను బయటకు తీసే ప్రక్రియను నిపుణుల సాయంతో కొనాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. అవి గేట్ల మధ్య ఇరుక్కుపోవడం, అధిక బరువుకు తోడు, వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. ఐదో రోజు బోట్ల తొలగింపు ప్రక్రియ అసంతృప్తిగా ముగిసింది. ఐదో రోజు భారీ గొలుసులతో బోటును బయటకు తెచ్చేందుకు ప్రయత్నం చేసిన రెస్క్యూ టీమ్‌ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో శనివారం మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిలిపివేశారు. అనంతరం నిపుణులతో చర్చించి రేపు మళ్లీ మరో పద్ధతిలో బోట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు.


Similar News