ఉద్యోగ,ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు విడుదల చేయండి: విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా
ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ ధర్నాకు దిగింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ ధర్నాకు దిగింది. విజయవాడలో గాంధీనగర్ ధర్నా చౌక్ దగ్గర ఏపీటీఎఫ్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ పాలనలో విద్యావ్యవస్థలో సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకపోగా మరిన్ని సమస్యలు తోడయ్యాయని ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.30వేల కోట్ల బకాయిలు చెల్లించాలి అని తెలిపారు. పీఆర్సీలు సైతం ఇవ్వడం లేదన్నారు. డీఏలు సైతం విడుదల చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన 117 జీవో పాఠశాల విద్యావ్యవస్థ వినాశనానికి దారి తీస్తుందని.. దాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ జారీ చేసిన జీవో-117 ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలి అని డిమాండ్ చేశారు. విద్యారంగానికి 40 డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని కానీ కేవలం 12 డిమాండ్లపైనే ధర్నా చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని విరమించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్లకు 010 పద్దు కింద జీతాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు.
పోస్టుల రద్దు ప్రభుత్వం కుట్ర
రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి దాదాపు 35వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని పోస్టులు ఖాళీగా లేవని చెప్తోందన్నారు. కేవలం 10వేల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వం అవలంభించిన విధానాలే కారణమని ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యాయులపై పని భారం మరింత పెరిగింది. ఉపాధ్యాయ పోస్టులు భారీ ఖాళీలు ఉండటంతో ప్రభుత్వం పోస్టుల కోతలు పెట్టేలా 12వేల స్కూల్స్‌ను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చారు అని ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల దాదాపు 18వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు అయినట్లు తెలిపారు.
అధికారుల నిరంకుశ దాడులు నిలిపివేయాలి
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో సీపీఎస్‌ను ద్దు చేసి ఓపీఎస్ తీసుకువస్తామని హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ నేతలు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో జీపీఎస్ అమలు చేస్తామని తెలిపారని.. ఈ స్కీంను తాము అంగీకరించేది లేదని చెప్పుకొచ్చారు. జీపీఎస్‌ను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం అని చెప్పుకొచ్చారు. ఈ గ్యారంటీ స్కీం ప్రభుత్వానికి గ్యారంటీ తప్ప ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కాదు అని చెప్పుకొచ్చారు. ఓపీఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉపాధ్యాయులపై అధికారుల నిరంకుశ దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్కూల్స్‌పై ఉన్నతాధికారులు దాడులు చేస్తూ సస్పెన్స్ చేస్తున్నారని అంతేకాదు ఇంక్రిమెంట్లు సైతం నిలిపివేయిస్తున్నారని ఆరోపించారు. స్కూల్స్‌కు ఆలస్యంగా పుస్తకాలు ఇచ్చి సిలబస్ పూర్తి చేయలేదని ఆరోపిస్తూ చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇకనైనా అధికారులు నిరంకుశ దాడులు నిలిపివేయాలని లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఏపీటీఎఫ్ నేతలు హెచ్చరించారు.