చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్..సీఐడీపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ రావడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.
దిశ , డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ రావడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరమని అన్నారు. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడామన్నారు. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి అని సూచించారు. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి అని సూచించారు. జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటన్నారు. అక్రమ కేసులు వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. జగన్ రెడ్డి నియంతపాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు భారీ ఊరట
ఇకపోతే స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు అనంతరం ఏపీ హైకోర్టు వాదనలు ముగిసినట్లు నవంబర్ 16న ప్రకటించింది.అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సోమవారం చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఎలాంటి షరతులు విధించలేదు. కానీ నవంబర్ 28 వరకు మధ్యంతర బెయిల్‌లో విధించిన షరతులు వర్తిస్తాయని తెలిపింది. ఇకపోతే ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.