కట్టేది చంద్రబాబు.. కూల్చేది జగన్ రెడ్డి: నారా లోకేశ్

రాష్ట్రంలో డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని..రాజా రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.

Update: 2023-02-28 07:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని..రాజా రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎటు చూసినా వైసీపీ ప్రభుత్వం అరాచకాలే కనబడుతున్నాయని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గం మామండూరు విడిది కేంద్రం వద్ద రజక సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా దోబి ఘాట్స్ లేవు... ఉన్న చోట కనీస సౌకర్యాలు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్‌కు తెలియజేశారు. వాషింగ్ మెషిన్లు, ఐరెన్ బాక్సులు సబ్సిడీలో అందించాలని విజ్ఞప్తి చేశారు. దోబి ఘాట్స్‌కి విద్యుత్ బిల్లులు కట్టాలని జగన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.

దేవాలయాలు, ఆసుపత్రుల్లో రజకులకు కాంట్రాక్టులు ఇవ్వాలని... తిరుమల ఆలయం పరిధిలో బట్టలు ఉతికే కాంట్రాక్టులు ఇతర రాష్ట్రాలు వాళ్ళు చేస్తున్నారని ఆ కాంట్రాక్టును స్థానిక రజకులకి ఇవ్వాలి అని కోరారు. ఇతర రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారని కాబట్టి తమను కూడా ఎస్సీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తిరుపతిలో రజక భవనాల నిర్మాణానికి సహాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని దోబి ఘాట్స్‌ని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని... చెరువుల్లో బట్టలు ఉతకడానికి లేదంటూ దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు చెరువుల దగ్గర బట్టలు ఉతుక్కోవడానికి హక్కు కల్పించాలి అని రజకులు నారా లోకేశ్‌కు మెురపెట్టుకున్నారు.

తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టం

తెలుగుదేశం హయాంలో రూ.22కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా దోబీ ఘాట్స్ నిర్మించినట్లు నారా లోకేశ్ తెలియజేశారు. శాసన మండలి సభ్యుడుగా రజక సామాజిక వర్గానికి చెందిన దువ్వారపు రామారావుకు అవకాశం కల్పించినట్లు చెప్పుకొచ్చారు. రజక సామాజిక వర్గంపై జగన్ పాలనలో వేధింపులు తీవ్రమయ్యాయని.. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అవినీతి, కరెంట్ కనెక్షన్ కోసం కూడా డబ్బులు అడుగుతున్నారు అని చెప్పినందుకు మునిరాజమ్మ పై దాడి చేశారని లోకేశ్ తెలిపారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం అని లోకేశ్ తెలిపారు.

ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. రూపాయి నిధులు ఇవ్వని కార్పొరేషన్ అవసరమా? అని లోకేశ్ ప్రశ్నించారు. బీసీలకు పుట్టినిల్లు టీడీపీ...జగన్ బీసీల వెన్నుముక విరిచాడు అని ధ్వజమెత్తారు. టీడీపీతోనే బీసీలు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దోబి ఘాట్స్‌కి విద్యుత్ ఉచితంగా ఇస్తాం అని స్పష్టం చేశారు. కట్టేది చంద్రబాబు ... కూల్చేది జగన్ రెడ్డి అని విమర్శించారు. తిరుమలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టలను రజకులకు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News