AP NDA Manifesto : మేనిఫెస్టో రిలీజ్ చేసిన చంద్రబాబు.. మహిళలపై హామీల వర్షం..!
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ ఇతర నేతలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ ఆరు ప్రధాన హామీలు ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలతో మీ ముందుకు వచ్చామని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కూటమిగా జట్టు కట్టామని స్పష్టం చేశారు. తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఆకాంక్షతో ముందుకు వచ్చామని తెలిపారు. కేంద్రం నుండి రాష్ట్రానికి మెండుగా సహకారం ఉంటుందని చెప్పారు.
ఇక, ఎన్డీఏ మేనిఫెస్టోలో మహిళలపై హామీల వర్షం కురిపించారు. ఏపీ పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఆడబిడ్డ నిధి పథకం కింది రాష్ట్రంలోని ప్రతి మహిళకు (19 సం నుండి 59 సం వరకు) నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం స్కీమ్ కింద ఒక్కో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని.. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని అనౌన్స్ చేశారు.
ఎన్డీఏ కూటమి ప్రధాన హామీలు:
= రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
= దీపం పథకం కింద ఏడాదిక మూడు ఉచిత సిలిండర్లు
= యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి
= స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు
= ప్రతి ఇంటికి ఉచిత నళ్లా కనెక్షన్
= ప్రతి మహిళకు నెలకు రూ.1500 (19 సంవత్సరం నుండి 59 సం వరకు)
= బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం