ఏపీలో బీజేపీ అభ్యర్థుల సంగతేంటి..?

ఏపీలో బీజేపీ అభ్యర్థుల సంగతేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి...

Update: 2024-02-24 14:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బీజేపీ అభ్యర్థుల సంగతేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాయనే సంకేతాలు కల్పించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిశారు. అయితే పొత్తులపై ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. దాదాపు 118 నియోజకవర్గాలకు ఉమ్మడి అభ్యర్థులను ఖరారు చేశార. టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా తొలి విడతలో జనసేనకు 24 సీట్లు కేటాయించారు. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.

అయితే బీజేపీ అభ్యర్థుల విషయంలో వస్తే మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే పొత్తులపై రాష్ట్ర పార్టీ నేతలు బీజేపీ హైకమాండ్‌కు తమ అభిప్రాయాలను తెలిపారు. ఇక పొత్తులపై బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయమంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పష్టం చేశారు. అయినా సరే బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో పొత్తులపై ఇంకా అడుగులు వేయలేదు. దీంతో అసలు టీడీపీ, జనసేతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అటు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై తాను చాలా కృషి చేశానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అయినా సరే బీజేపీతో కాకుండా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఇంకా 57 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీతో పొత్తులో భాగంగానే ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా టీడీపీ, జనసేన ఎదురు చూస్తున్నాయా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ చాలా ఎక్కువ సీట్లు అడగటంతోనే టీడీపీ, జనసేన అభ్యర్థులను ముందుగానే ప్రకటించారనే టాక్ కూడా నడుస్తోంది. అసలు బీజేపీతో పొత్తు ఉందా..?, లేదా అనేది చంద్రబాబుగానీ, పవన్ కల్యాణ్ గాని అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Read More..

నేటి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా పర్యటన..

Tags:    

Similar News